సిటీబ్యూరో,వెంగళరావునగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో చాలా భవనాలకు ఫైర్ ఎన్వోసీలు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అమీర్‌పేటలోని మైత్రీవనం దగ్గర అగ్నిప్రమాదం జరిగిన స్థలాన్ని శుక్రవారం రంగనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, నగరంలో భవనాల అక్రమ నిర్వహణ, వాటి అనుమతులపై ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదానికి గురైన భవన అనుమతులను పరిశీలించి నాలాను ఆక్రమించి నిర్మించినట్లు తేలితే భవనాన్ని కూల్చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మల్కాజిగిరి కమిషనర్‌తో కలిసి హైడ్రా ఆఫీసులో సమన్వయ సమావేశం నిర్వహించారు.
వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వర్షాకాలం నీటమునకకు సంబంధించి ఎక్కడ ఏ సమస్య తలెత్తినా హైడ్రా దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ ,సీఎంసీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులతో వర్షాకాల సన్నద్ధతపై ఇప్పటికే సమీక్షించిన హైడ్రా కమిషనర్ ఎంఎంసీ కమిషనర్ వినయ్కృషా ్ణరెడ్డితో కలిసి మల్కాజిగిరి మున్సిపల్ పరిధిలో వచ్చే ఇబ్బందులపై చర్చించారు. ఎంఎంసీ పరిధిలో 188 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉంటే అందులో మేజర్ 69, మీడియం 39, మైనర్ 80 వరకూ ఉన్నాయన్నారు. డీఆర్ఎఫ్కు చెందిన 5 మందితో కూడిన టీమ్‌లు 12, మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు 74, 175 మంది స్టాటిక్ సిబ్బంది నిత్యం క్షేత్రస్తాయిలో పనిచేస్తారని, అవసరమైతే సిబ్బంది సంఖ్యను పెంచుతామని రంగనాథ్ తెలిపారు. వీళ్లతో పాటు హైడ్రా ఎస్ఎఫ్వోలు ఉంటారని, హైడ్రా,
మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు, జలమండలి, ఇరిగేషన్ , విద్యుత్‌శాఖ, యూబీడీ శాఖలతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విభాగాలకు చెందిన అధికారులతో కమిషనరేట్ నుంచి డివిజన్ వరకు వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటుచేసుకుని సమన్వయంతో పనిచేయాలని, ప్రమాదాలకు కారణమయ్యే శిథిలావస్థలో ఉన్నభవనాలు, భారీ ప్రకటన బోర్డులను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9 చెరువులకు ఫ్లడ్‌గేట్లు అమర్చాల్సిన అవసరముందని, కార్పొరేషన్ పరిధిలో 14 సర్కిళ్లున్నాయని, ప్రస్తుతం 12 డీఆర్ఎఫ్ బృందాలకు తోడు మరో రెండు పెంచి 14 చేయాలని మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హైడ్రా కమిషనర్‌ను కోరారు.
ప్రపంచపర్యావరణదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని పలుకూడళ్లలో శుక్రవారం హైడ్రా ప్రకృతి పరిరక్షణపై చైతన్యకార్యక్రమాన్ని చేపట్టింది. ట్రాఫిక్ పోలీసులు, ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై మన చెరువులు మన భవిష్యత్ , ప్రకృతిని పరిరక్షిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినదించారు. బాలాపూర్ చౌరస్తా, అమీర్‌పేటలోని మైత్రీవనం, ఆరాంఘర్చౌరస్తా, కర్బలా జంక్షన్, ఎల్బీనగర్, హైటెక్ సిటీ, గోల్కొండ, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది స్థానికులతో కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టారు. హైడ్రా ఆర్ఎఫ్వో జయప్రకాశ్ పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పరిశుభ్రమైన పరిసరాల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించారు.