సిటీబ్యూరో:మూసీ రివర్‌ఫ్రంట్ బోర్డుతో తమకు సంబంధం లేదని, అయినప్పటికీ మూసీ ఆక్రమణలపై చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నాలా వెడల్పులకు సంబంధించిన సమాచారం తీసుకుంటున్నామని , మూసీలో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో.. తమకు తెలిసిన చోట కూడా బిల్డర్స్‌కు చెప్పామని వారు తొలగించారని చెప్పారు. రాబోయే సంవత్సరంలో మూసీ ఆక్రమణలపై బిల్డర్స్‌ను ప్రాసిక్యూట్ చేస్తామని రంగనాథ్ అన్నారు. హైడ్రా ఏర్పడిన తర్వాత తమ పనితీరు, రాబోయే సంవత్సరంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తామన్న విషయాలపై శనివారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. జూలై 19న హైడ్రా ఏర్పాటైందని, ఓఆర్ఆర్ లోపల 2వేల చదరపు కిలోమీటర్ల మేర హైడ్రా పరిధిలోకి వస్తుందని, తెలంగాణలో 35 శాతం జనాభా తమ పరిధిలో ఉంటారని రంగనాథ్ తెలిపారు.
హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని, 12 చెరువులను, 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా కాపాడామని రంగనాథ్ తెలిపారు. ఆరు నెలల్లో హైదరాబాద్‌లో వర్షాలు పడి నీటమునిగితే హైడ్రా ఏం చేయలేదనే భ్రమలో ఉండొద్దని, హైడ్రా తీసుకొచ్చిందే ఆస్తులను కాపాడటం కోసమేనన్నారు. క్లౌడ్ బరస్ట్‌లు పెరిగాయని, ఐదు పదేండ్లు నిర్విరామంగా చేస్తే తప్ప ఏం చేయలేమన్నారు. హైడ్రా ఏర్పాటుతో ప్రజల్లో బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లపై అవగాహన పెరిగిందని, తాము ఏదైనా కొనాలనుకుంటే పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేస్తున్నారన్నారు.
హైడ్రా అంటే కూల్చివేతలే కాదని, పునరుజ్జీవనం కూడా హైడ్రా లక్ష్యమని, పన్నెండు చెరువుల పునరుద్ధరణకు సంబంధించి హైడ్రా డీపీఆర్ తయారు చేసిందన్నారు. బడ్జెట్ ఇస్తే తామే చెరువులను అభివృద్ధి చేస్తామని, లేకుంటే ఏజెన్సీలకు ఇస్తే సహకరిస్తామని తెలిపారు. చెరువులకు సంబంధించి ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో దానిని తాము స్వాధీనం చేసుకుంటున్నామని, ఇదే క్రమంలో ఖాజాగూడకు సంబంధించి పర్మిషన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒప్పుకుంటామని, ముందుకు వస్తే మాత్రం ఊరుకోబోమని చెప్పినట్లు తెలిపారు.
ఓఆర్ఆర్ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని, రకరకాల డేటాల ద్వారా వచ్చే ఏడాది కల్లా ఎఫ్టీఎల్ నిర్ధారణ చేస్తామని, చెరువుల హద్దులపై గ్రౌండ్ వర్క్ జరుగుతున్నదని, సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్జోన్లు నిర్ణయిస్తున్నామని, వీటిపై స్పష్టత రాగానే హైడ్రా యాక్టివ్ అవుతుందని రంగనాథ్ తెలిపారు. శాటిలైట్ ఇమేజ్‌తో అత్యంత రెజుల్యూషన్ ఉన్న డేటాను తీసుకుంటున్నామని, 2000 నుంచి 2024 వరకు శాటిలైట్ ఫొటోలతో పాటు 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్ ఇమేజెస్ కూడా ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం వాడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు వచ్చాయని, 27 మున్సిపాలిటీల్లో అనధికార నిర్మాణాలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. రోజురోజుకూ హైడ్రాకు వచ్చే ఫిర్యాదులు పెరుగుతున్నాయని, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామని రంగనాథ్ తెలిపారు.
శిఖంపట్టా ఉన్నవారికి హక్కులుండవు..
బుద్ధభవన్ బఫర్‌జోన్‌లో ఉంటుందంటున్న ప్రశ్నకు బుద్ధభవన్ కింద ఉన్న నాలాను ఎక్కడా బ్లాక్ చేయడం లేదని స్పష్టం చేశారు. చెరువులను కబ్జా చేస్తున్నదానిపై శిఖం పట్టా అనేది కీలకమన్నారు. శిఖం పట్టా కింద తీసుకుని కబ్జాలకు చేస్తున్న దానిపై తాము న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. అసలు శిఖం పట్టా విషయంలో ఇందులో రెండురకాలుంటాయన్నారు. ఒకటి సర్కారీ శిఖం, మరొకటి శిఖం పట్టా ఉంటుందని, చెరువు తయారు చేసేటప్పుడు శిఖం పట్టాకు పరిహారం ఇచ్చే చేస్తామని, ఆ తర్వాత ఏక్‌సాల్ పట్టా ఇస్తారన్నారు. ఆ తర్వాత లీజ్ రెన్యువల్ కాకుండా పహానీలో పట్టా అని రావడం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు. శిఖం పట్టా ఉన్న వారికి ఎలాంటి ఓనర్ షిప్ ఉండదని, వారు కేవలం సాగు చేయడం తప్ప..హక్కులు ఉండవన్నారు.
అధికారులపై చర్యలకు సిఫారసు..!
చెరువుల ఆక్రమణలు తొలగించే సమయంలో అక్కడ ఆక్రమణలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు. గండిపేట వంటి చాలా చోట్ల అధికారులపై చర్యలకు సిఫారసు చేశామన్నారు. నిజాంపేటకు సంబంధించిన చెరువుల ఆక్రమణలకు సంబంధించి 6గురిపై, ఆ తర్వాత ఐదుగురిపై చర్యలకు సిఫారసు చేశామన్నారు. చాలా మంది అధికారులను కూడా ఆక్రమణల విషయంలో గుర్తించామన్నారు.
త్వరలో హైడ్రా పీఎస్..ఎఫ్ఎం రేడియో..
ప్రస్తుతం హైడ్రాకు 15 బృందాలు పనిచేస్తున్నాయని, మరికొందరిని కూడా రిక్రూట్ చేసుకుంటున్నామని రంగనాథ్ తెలిపారు. త్వరలోనే 72 డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వెదర్ డేటాను విశ్లేషించేందుకు హైడ్రాలో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నామని, హైడ్రాకు త్వరలో ఒక ఎఫ్ఎం చానల్ ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తున్నామన్నారు. హైడ్రా కార్యాలయంలో వచ్చే ఏడాది నుంచి ప్రతీ సోమవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో త్వరలోనే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇకపై కిరాయిదారులకూ నోటీసులు..
శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని, జూలై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతులు ఉన్నా.. లేకున్నా నివాసగృహాల జోలికి హైడ్రా పోదని, ఇకపై ఆక్రమణలు చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పారు. ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చినప్పుడు కట్ ఆఫ్ డేట్ పెట్టి అక్కడి నుంచి చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్రమణలను ఆక్రమణలుగా చూస్తామని, అయితే నివాస గృహాలు కాకుండా కమర్షియల్‌గా ఉన్నవాటిని మాత్రం ఊరుకునేది లేదని రంగనాథ్ తెలిపారు. ఎఫ్టీఎల్లో అనాథరైజ్డ్ షెడ్స్ ఉంటే తాము ఊరుకోబోమని చెప్పారు. నోటీసుల విషయంలో కూడా ల్యాండ్ ఓనర్స్కు ఇవ్వడం వారు కిరాయిదారులకు కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని, ఇకపై కిరాయిదారులకు కూడా నోటీసులు ఇస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.
చెరువే లేదు.. చర్చ ఎందుకు..
మెడ మీద తల ఉంటదా.. తల మీద మెడ ఉంటదా.. అనే అడిగితే మెడ మీద తల ఉన్నట్లుగా చెరువుకట్టకు పైన ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ఉంటుందని.. చెరువుకట్టకు కిలోమీటర్ దూరంలో మేం ఉంటామని రంగనాథ్ తెలిపారు. అక్కడ చెరువే లేదని, లేని చెరువు గురించే చర్చ చేస్తున్నామన్నారు. బఫర్, ఎఫ్టీఎల్ ఎప్పుడొస్తుందంటే.. నీరు ప్రవహిస్తూ వచ్చినప్పుడు అడ్డుకట్ట అయినప్పుడు అక్కడ నీరు ఆగి దాని అప్‌స్ట్రీమ్ అంతా మునిగిపోతుందని, అక్కడ ఎఫ్టీఎల్, బఫర్జోన్లు వస్తాయన్నారు. ‘మా ఇల్లు డౌన్ స్ట్రీమ్‌లో కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అక్కడ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ఎందుకు వస్తుంద’ని ప్రశ్నించారు.