బంజారాహిల్స్, అక్టోబర్ 10 : నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడటంలో 10 నెలలుగా వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. రెవెన్యూ, జలమండలి, పోలీసుల మధ్య సమన్వయ లోపంతో పాటు లేని సర్వే నెంబర్‌ను ఉన్నట్లు చూపిస్తూ న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తూ ఏడాది నుంచి సుమారు రూ.600కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు కొంత మంది వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలను వరుస కథనాలతో నమస్తే తెలంగాణ ఎప్పటికప్పుడు ఎండగట్టిన సంగతి తెలిసిందే. తాజాగా రెండ్రోజుల క్రితం కూడా ప్రైవేటు వ్యక్తులు స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కబ్జాలకు ప్రయత్నిస్తున్న తీరును నమస్తే తెలంగాణ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది.
దీంతో రెవెన్యూ,జలమండలి అధికారుల ఫిర్యాదులతో శుక్రవారం ఉదయాన్నే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పీ, టీఎస్ నెంబర్ 1/పార్ట్, బ్లాక్ హెచ్, వార్డు-10లోని 5ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎకరన్నర స్థలాన్ని జలమండలి కోసం కేటాయించగా మరో మూడున్నర ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. సుమారు రూ.400కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎకరన్నర స్థలం జలమండలి విజిలెన్స్ విభాగం ఆధీనంలో ఉండగా మూడున్నర ఎకరాల స్థలం షేక్‌పేట మండల రెవెన్యూశాఖ ఆధీనంలో ఉంది. అయితే ఈ స్థలం సర్వే నెంబర్ 403/52 నెంబర్లోకి వస్తుందంటూ కొన్నేళ్లుగా పరుశరాం పార్థసారథి అనే వ్యక్తితో పాటు అతడి కొడుకు విజయ్ భార్గవ్ వివాదాలు సృష్టించడంతో పాటు పలుమార్లు స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
అయితే వారు చెబుతున్న సర్వే నెంబర్ రెవెన్యూ రికార్డుల్లోనే లేవని, బోగస్ పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ వారిపై పలుమార్లు క్రిమినల్ కేసులు కాడా నమోదయ్యాయి. తమకు ఈ స్థలాన్ని నూకల రాఘవరావు, మేర్ల నారాయణ అనే వ్యక్తులకు చెందిన కుటుంబసభ్యులు డెవలప్మెంట్ ఇచ్చారంటూ వీఆర్ ఇన్ఫ్రా పేరుతో పార్థసారథి కొడుకు విజయ్‌భార్గవ్ మరోసారి కోర్టును ఆశ్రయించగా హైకోర్టు వేర్వేరుగా రెండు స్టేలు మంజూరు చేయడం.. నెలరోజుల క్రితం పెద్ద ఎత్తున రౌడీలు, మహిళలతో వచ్చిన కింగ్డమ్ రియల్ ఎస్టేట్ ఎల్ఎల్పీ తరపున వచ్చామని, తమకు విద్యాసాగర్ అనే వ్యక్తి వారసులు స్థలాన్ని డెవలప్మెంట్ ఇచ్చారంటూ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే.
రెండు సంస్థలకు చెందిన పత్రాలు బోగస్‌వే అని, ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్న రెండు సంస్థల ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలని షేక్‌పేట తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో నెలరోజుల క్రితం బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా గతేడాది డిసెంబర్ నుంచి జలమండలికి చెందిన 1.20 ఎకరాల స్థలంతో పాటు పక్కనున్న 3.20 ఎకరాల స్థలం ఆక్రమణలకు గురవుతున్నట్లు నమస్తే తెలంగాణలో కథనాలు ప్రచురించడం.. వాటి ఆధారంగా రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టడం.. రెండు మూడురోజుల్లోనే మరోసారి కబ్జాదారులు స్థలంలోకి ప్రవేశించడం ప్రహసనంగా మారింది. రెవెన్యూ శాఖలో ఉన్నత స్థాయిలో పరిచయాలు అడ్డం పెట్టుకోవడంతో పాటు జలమండలిలో కొందరు అధికారులను,పోలీసు శాఖలో కొంతమందిని గుప్పిట్లో పెట్టుకున్న కబ్జాదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు వినిపించాయి.
రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రైవేటు వ్యక్తులు స్థలంలోకి ప్రవేశించడం, నిఘా కోసం అక్కడ ఉండే జలమండలి విజిలెన్స్ సిబ్బందిని బయటకు పంపించేవారని, తమ కబ్జాలు బయటకు కనిపించకుండా భారీ ఎత్తున రేకుల షెడ్లను ఏర్పాటు చేసినా అధికారులు స్పందించ లేదని స్థానికులు ఆరోపించారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్థసారథి అరెస్టయి బెయిల్‌మీద బయటకు వచ్చాడని ఆ తర్వాత మూడు కేసులు నమోదైనా నోటీసులతో సరిపెట్టడంతో పలుమార్లు కబ్జాలకు యత్నించారని ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలోనే న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తూ స్టేటస్ కో ఆదేశాలు సాధించి, స్థలంలోకి ప్రవేశించేందుకు యత్నించారని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం మీద హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో అయినా కబ్జాదారులు తమ ప్రయత్నాలు విరమించుకుంటారో లేక మరోసారి ప్రయత్నిస్తారో వేచి చూడాల్సి ఉంది.