సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తున్న రాష్ట్రంలో… పల్లేర్లు మొలిసినట్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కకావికలమవుతోంది. ఆచరణకు సాధ్యం కాని హామీలకు తోడు అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని కాంగ్రెస్ సర్కార్ తీరు ఆర్థిక వ్యవస్థకు శరాఘాతంలా మారింది.ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ లోపాభూయిష్ట విధానాలు ఓ పక్క, మరోపక్క నిర్మాణాలపై హైడ్రా సంస్థ పడగ.. నగర రియాల్టీ రంగాన్ని అథఃపాతాలానికి తొక్కేశాయి. ఇటీవల కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిన నివేదిక ద్వారా రాష్ట్రం ఆర్థికంగా ఎలా చితికిపోయిందనే విషయం స్పష్టం అవుతోంది. వరుసగా మూడుసార్లు మైనస్ ద్రవ్యోల్భణంలోనే ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుండటం రియాల్టీ రంగంపై పిడుగేసినట్లుగా మారిందనీ..దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా రియల్ వ్యాపారులు చితికిపోతున్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రియల్ ఎస్టేట్‌పై కోలుకోలేని దెబ్బ..
రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పరిధి దాటి.. అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఖజానాకు వెన్నుముక లాంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని కోలుకోలేని దెబ్బ కొడుతూనే ఉంది. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం -0.15శాతంగా నమోదు కావడం, వరుసగా మూడు నెలలుగా డిఫ్లేషన్ పరిస్థితి ఉండటంతో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొనుగోలు శక్తి క్షీణించడం రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ఆందోళనకర స్థితికి తీసుకెళ్లింది. ఇది పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. దీనికి తోడు డిఫ్ల్లేషన్ వల్ల మార్కెట్లో డబ్బు చెలామణి తగ్గిపోవడం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రాజెక్టులకు శాపంలా మారింది.
కొనుగోలుదారులు ఖర్చు తగ్గించడంతో డిమాండ్ లేకుండా పోతుంది. దీంతో కొత్త ప్రాజెక్టుల లాంచింగ్‌లు తగ్గి, ఇన్వెంటరీ పేరుకుపోవడంతో నిర్మాణ రంగంతోపాటు, నిర్మాణ అనుబంధ రంగాలు, సేవా, బీమా రంగాలను కూడా కుదుపేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారు గృహ రుణాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. డిఫ్ల్లేషన్ కారణంగా బ్యాంకులు కూడా రియాల్టీలో నెలకొని ఉన్న క్లిష్టమైన పరిస్థితుల దృష్ట్యా హౌజింగ్ ఫైనాన్స్‌కు ఆసక్తి చూపడం లేదు. దీంతో మెజార్టీ ప్రజలకు కొనుగోలు అవకాశం లేకపోవడంతో అమ్మకాలు నిలిచిపోయాయి.
అనాలోచిత నిర్ణయాలతో ఆగమాగం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా నిలబడింది. ముఖ్యంగా రైతు బంధు, పుష్కలమైన నీటి వనరులతో, మెరుగైన పంట దిగుబడితో రాష్ట్రం ఆర్థికంగా సుస్థిరమైన అభివృద్ధిలో దూసుకుపోయింది. అయితే అసెంబ్లీ ఎన్నికలప్పడు కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలనిచ్చి.. అధికారం చేపట్టిన అనంతరం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రైతు బంధులో జాప్యం, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం తదితర ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలుచేయలేదు. ముఖ్యంగా హైడ్రా కూల్చివేతల కారణంగా మార్కెట్లో భూముల, నిర్మాణాల క్రయవిక్రయాలు స్తంభించేలా చేశాయి. గడిచిన 3 త్రైమాసికాలలో వెల్లడైన గణాంకాలు కూడా నగరంలో కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ సగటున 35-40శాతం తగ్గినట్లుగా తేల్చాయి. చిన్నా చితకా మినహా చెప్పుకోదగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు లేకుండాపోయాయి.
నగరానికి కీలకమైన ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ గడిచిన 18 నెలలుగా ఆధ్వాన్నంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ సరైన డిమాండ్ లేకపోవడంతో 2.5మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇన్వెంటరీ ఉందని తేలింది. వీటన్నింటికి ఇటీవల జరిగిన సందడి లేని ప్రాపర్టీ షోలు, గిరాకీ లేని భూముల వేలంపాటలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఇక ఇటీవల టీజీఐఐసీ ద్వారా నిర్వహించిన వేలంలో రూ.177 కోట్లకు ఎకరం భూమి విక్రయించిందని గొప్పలు పోయినా, పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రియల్ వ్యాపారులే చెప్పుకుంటున్నారు. ఎకరం ధర ఆ స్థాయిలో పలికినా హైరైజ్ ప్రాజెక్టులకు మాత్రమే గిట్టుబాటు అవుతుందని, రెసిడెన్షియల్ సెగ్మెంట్‌కు ఏమాత్రం అనుకూలం కాదనే విమర్శలు ఉన్నాయి.