సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ ) : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి..హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. హెచ్ఎండీఏ, ఆర్ అండ్ బీ శాఖ ఐదు చోట్ల ఫ్లై ఓవర్లు చేపట్టింది. ట్రాఫిక్, వాహన రద్దీ ఉపశమనానికి ఎస్ఆర్డీపీ దోహదపడుతున్నది.
ప్రయాణ వేగాన్ని పెంచడం, సమయాన్ని తగ్గించడం, వాయు కాలుష్యాన్ని తగ్గించడం, అంతేకాకుండా కనిష్ఠ భూ సేకరణ నిధుల ఆధారంగా ఎస్ఆర్డీపీకి ప్రాధాన్యత ఇచ్చారు. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన అధికారులు.. తాజాగా రూ.799.74కోట్లతో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు ఆరు లేన్లతో119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర చేపట్టిన అతి పొడవైన ఫ్లై ఓవర్ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. జూపార్కు ఫ్లై ఓవర్ 23వ ఫ్లై ఓవర్ కాగా, ఇప్పటికే 14 చోట్ల ఆర్వోబీ, ఆర్‌యూబీలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన ఐదు చోట్ల పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఎస్ఆర్డీపీ పూర్తి ఫలాలు అందుబాటులోకి తేస్తామని అధికారులు తెలిపారు.
ఎట్టకేలకు ప్రారంభం..
ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి రావాల్సిన జూపార్కు -ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంపై రాజకీయ రంగు అలుముకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్‌తో ఈ ఫ్లై ఓవర్ వాహనదారులకు అందుబాటులోకి ఇంతకాలం తీసుకురాలేదన్న చర్చ అటు జీహెచ్ఎంసీ అధికార వర్గాలు, ఇటు పాలక మండల సభ్యుల్లో జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవ సంబురాల్లో పురపాలకకు సంబంధించిన ఈ నెల 3న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరపాలని నిర్ణయించి కొన్నింటిని ప్రారంభించారు. అయితే షెడ్యూల్ ప్రకారం వర్చువల్ విధానంలో జూపార్కు-ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభం ఉన్నదని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కానీ ఆ రోజు కుదరలేదని చెబుతూ వాయిదా వేశారు. ఆ తర్వాత 5ఐదవ తేదీ, 8వ తేదీ అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు 9న ఈ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ నాలుగు దఫాలుగా వాయిదా వేస్తూ వచ్చిన అధికారులు ఎట్టకేలకు సోమవారం ప్రారంభిస్తుండడం గమనార్హం.
పాతనగరానికి మహా రిలీఫ్
పాతనగరంలో ఇప్పటికే పలు ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. ఓవైసీ ఫ్లై ఓవర్, అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ అందుబాటులోకి తీసుకురాగా..ఆరాంఘర్-జూపార్కు ఫ్లై ఓవర్‌తో శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రయాణం సాఫీగా సాగనున్నది. ఆరాంఘర్, శాస్త్రిపురం, కలాపత్తర్, దారుల్ ఉల్ం, శివరాంపల్లి, హసన్‌నగర్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత ఉపశమనం లభించనున్నది. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థకు దోహద పడనున్నది. కాగా, భూ సేకరణలో నెలకొన్న జాప్యం కారణంగా సర్వీస్ రోడ్డు, ర్యాంపులు ఆలస్యం కానున్నది.
ప్రాజెక్టు విశేషాలు