Hyderabad | కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలు రెండు టర్మ్లల్లో హైదరాబాద్ భూతల స్వర్గమయ్యింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐకాన్ వల్ల గ్లోబల్ సిటీగా వినుతికెక్కింది. ఆయన అనితర సాధ్యమైన సామర్థ్యంతో ఐటీ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. ప్రత్యక్ష కొలువులు, పరోక్ష ఉపాధిలో రాష్ట్ర యువతకు హైదరాబాద్ గమ్యస్థానమైంది.
ఈవీఎం మీట నొక్కే టైం సమీపిస్తున్నది. మరి 3.17 కోట్ల ఓటర్ల మదిలో ఉన్నదేంటి? అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోయే 17.01 లక్షల కొత్త ఓటర్ల కడుపులో ఏమున్నది? ఏకంగా 1.20 కోట్ల అత్యధిక జనాభా గల హైదరాబాదీలు ఏం ఆలోచిస్తున్నారు? ఎటువైపు మొగ్గుతున్నారు? మెజారిటీ పౌరులు అందునా యువత స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వాన్నే కోరుకుంటున్నట్టు విదితమవుతున్నది.
2014కు ముందు రూ.57,258 కోట్ల్లు ఉన్న ఐటీ ఎగుమతులు 2023కల్లా రూ.2,41,275 కోట్లకు ఎగబాకాయి. మొత్తంగా తెలంగాణ శ్రేయస్సుకు ఊతమైంది. కాబట్టే కొత్త తరాలకు విద్య, ఉద్యోగాల కోసం కనుల ఎదుట నిలిచిన కల్పతరువయ్యారు మంత్రి కేటీఆర్. యువత చదువులు, కొలువులకు కొదవే లేదని నిరూపించారు. ఈ పురోగమన లీడర్‌షిప్‌నకు మద్దతుగా నిలువాలని తాము గట్టిగా డిసైడ్ అయినట్టు ఐఐటీ హైదరాబాద్ డ్యూయల్ డిగ్రీ హోల్డర్, హైదరాబాదీ తుమ్మ వినీత్ రెడ్డి చెప్పాడు. అల్వాల్‌లో నివసించే 23 ఏండ్ల వినీత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్నాడు. మెకానికల్ ఇంజినీరింగ్ & ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో డ్యూయల్ డిగ్రీ హైదరాబాద్‌లోనే తాను పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అనువైన స్థితిగతులే కారణమంటాడు. కేసీఆర్ సర్కార్, ఐటీ శాఖను అంచనాకు అందని విధంగా మంత్రి కేటీఆర్ లీడ్ చేయడం వల్ల అనేక విదేశీ, ఎంఎన్సీ కంపెనీలు హైదరాబాద్‌ను హెడ్‌క్వార్టర్స్‌గా ఎంచుకోవడంతో తనలాంటి ఎందరికో ఇక్కడే ఉద్యోగ భాగ్యం సులువైందని ఈ నూనుగు మీసాల ఐఐటీయన్/టెకీ హానెస్ట్‌గా విశ్లేషించాడు.
రాయదుర్గంలోని ప్రఖ్యాత యూఎస్ఏ కంపెనీలో డేటా సైంటిస్టుగా రూ.30 లక్షల వార్షిక ప్రారంభ ప్యాకేజీతో గడిచిన అక్టోబర్ 16న విధుల్లో చేరాడు వినీత్ రెడ్డి. తనలాంటి యువతరం బంగారు భవితకు బీఆర్ఎస్ ప్రభు త్వం దీర్ఘకాలిక వ్యూహాలతో దృఢమైన పునాదులు వేసిందని కితాబిచ్చాడు. తమ సర్కిల్స్‌లో కేటీఆర్ నాయకత్వ నైపుణ్యం గురించి చర్చ చేస్తూ, అనేక సందర్భాల్లో కృతజ్ఞతగా కొనియాడుతుంటామని సంతోషంగా చెప్పాడు. తెలంగాణ రాష్ట్రం ఒక స్టార్టప్ వెంచర్‌గా వెలిసిందంటే అది కేటీఆర్ విజనరి విక్టరీనే అని తేల్చిచెప్పాడు. హైదరాబాద్‌లో 67 కిలోమీటర్ల వరకు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్ల మేర విస్తరింపజేయడం, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అదనంగా మరొకటి సంకల్పించడం గొప్ప విషయంగా అభివర్ణించాడు. అంతర్జాతీయ ప్రమాణాల వైద్య సేవలతో 10 వేల పడకల దవాఖానలు నెలకొల్పడం వంటివి వచ్చే వందేండ్లకు సరిపడా ప్రణాళికలు సజావుగా సాగాలంటే కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ కొట్టాలని ప్రగాఢంగా ఆకాంక్షించాడు. మన రాష్ట్రంలో ఈ ఒరవడి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగకూడదని, కంటిన్యుటీకి సపోర్టుగా తమ యంగ్ జనరేషన్ నిశ్చయమైందని తెలిపాడు. ఒకవేళ బీఆర్ఎస్ సర్కారు ఈ ఎన్నికల్లో గెలవకపోతే హైదరాబాద్ సహా తెలంగాణ తిరోగమనం తప్పదని ఎంతో ఉన్నతంగా, యథార్థంగా విశ్లేషించాడు యువ టెకీ వినీత్ రెడ్డి. మెజారిటీ ప్రజల ఆమోదం తప్పక లభిస్తుందనే చెరగని నమ్మకం, విశ్వాసానికి చిహ్నంగా తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. తనలాంటి ఎందరో ఇక్కడ ఉద్యోగం చేయడాన్ని పునరాలోచన చేసే దుస్థితి, విదేశాలకు వెళ్లే పరిస్థితి రావొద్దని హృదయ పూర్వకంగా ఆశిస్తున్నాడు.
…ఇల్లెందుల దుర్గాప్రసాద్