హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ, ఉపాధ్యాయుల బిల్లులు పెండింగ్.. రెండో పీఆర్సీ పెండింగ్.. ఆరు డీఏలు పెండింగ్.. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు పెండింగ్.. వీటి వరుసలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కూడా చేరింది. ఈహెచ్ఎస్ ట్రస్టుకు విధిగా సర్కార్ జమ చేయాల్సిన ప్రీమియం జమ చేయడం లేదు. రెండు నెలల ప్రీమియం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఫలితంగా ఈహెచ్ఎస్ స్కీమ్ సక్రమంగా అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు నగదు రహిత ఉచిత వైద్యం అందించేందుకు ఈహెచ్ఎస్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. జూలై 17న స్కీమ్‌ను ప్రారంభించగా, నెల రోజుల తర్వాత ఆగస్టు 22న ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5%, ప్రభుత్వ వాటాగా 1.5% చొప్పున ఈహెచ్ఎస్ ట్రస్టులో జమ చేస్తామని.. ఇలా జమ అయిన మొత్తం నుంచి దవాఖాన బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగుల వాటా ప్రీమియం ఈహెచ్ఎస్ ట్రస్టుకు చేరుతున్నది. ప్రభుత్వ వాటా మాత్రం రెండు నెలలకే జమ అయ్యింది. మే నెల వేతనం నుంచి ఉద్యోగుల ప్రీమియం కట్ చేసింది. జూన్, జూలై మాసాల వేతనం నుంచి ప్రీమియం కట్ చేశారు. తాజాగా ఆగస్టు నెల వేతనం నుంచి 1.5% కట్ చేసింది. కానీ ప్రభుత్వ వాటా ఇప్పటి వరకు రెండు నెలలు మాత్రమే జమ అయ్యింది.
ఈహెచ్ఎస్ స్కీమ్ కింద నెలకు ఉద్యోగులు రూ.44కోట్లు, ప్రభుత్వం రూ.44 కోట్ల చొప్పున ఈహెచ్ఎస్ ట్రస్టులో జమ చేయాలి. ఈ నాలుగు నెలల కాలంలో ఉద్యోగుల వాటాగా రూ. 176కోట్లు ప్రభుత్వం కట్ చేసింది. ప్రభుత్వ వాటాగా రూ. 176కోట్లు విధిగా జమ చేయాల్సి ఉండే. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం రూ. 88కోట్లు మాత్రమే విడుదల చేసింది. బకాయిలు, డీఏలు, పీఆర్సీ వంటి వాటి అమల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో యావత్తు ఉద్యోగ, ఉపాధ్యాయలోకం ఉద్యమానికి సిద్ధమైంది.
ఈ తరుణంలో సర్కార్ ఇవ్వాల్సిన వాటా పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. మా వాటా కట్ చేసినప్పుడు ప్రభుత్వ వాటా ఎందుకివ్వడంలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మా డబ్బులతోనే ఈహెచ్ఎస్ను నడపాలనుకుంటున్నారా..? అంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రెండు నెలల ప్రీమియాన్ని చెల్లించాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. రూ.88కోట్లు విడుదల చేయాలని ట్రస్టు బోర్డు సభ్యుడు సదానందంగౌడ్ కోరారు.