హామీ ఇచ్చి ఎగవేసిన కాంగ్రెస్ సర్కార్‌పై ఉద్యోగులు సమర శంఖం పూరించారు. పీఆర్సీపై తేల్చకపోవడం, సీపీఎస్ హామీ అటకెక్కించడంపై ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ జేఏసీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ విద్రోహదినం పాటించింది. తెలంగాణ సెక్రటేరియట్లో ఉద్యోగులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. ప్రధాన ద్వారాన్ని నిర్బంధించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1, (నమస్తే తెలంగాణ): నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నది. తమ హక్కుల కోసం, న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ, డీఏల కోసం ఉద్యోగులు కదంతొక్కారు. పాలనకు కేంద్రబిందువైన సచివాలయంలో ఉద్యోగులు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ ఏకమై భోజన విరామ సమయంలో సచివాలయ ప్రధాన ‘బాహుబలి’ ద్వారం వద్ద బైఠాయించి ఆకస్మిక ధర్నాకు దిగారు. ‘ఉద్యోగుల మహాగర్జన’ పేరుతో నిర్వహించిన ఈ ధర్నాతో సచివాలయ ప్రాంగణం దద్దరిల్లింది.
మూడేండ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలుకు నోచుకోలేదని, రికార్డుస్థాయిలో 6 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని విమర్శించారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, హెల్త్‌కార్డుల సమస్యను పరిషరించాలని, ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్న ఉద్యోగులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.
సచివాలయం మీడియా పాయింట్ వద్ద సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్‌రెడ్డి, ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేశ్‌కుమార్, టీజీఎస్ఏ జనరల్ సెక్రటరీ ప్రేమ్ దేవేందర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ రమాదేవి మాట్లాడుతూ మే 2న ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిషారానికి సానుకూలంగా స్పందించినప్పటికీ, నాలుగు నెలలు గడిచినా ఎలాంటి పురోగతి లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడే భాష సరిగా లేదని, ఉద్యోగులు ప్రభుత్వాన్ని భయపెడుతున్నారంటూ వ్యాఖ్యానించడం తగదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ముఖ్యమంత్రులు ఎవరూ ఇలా మాట్లాడలేదని, న్యాయమైన హకుల కోసమే పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఏడాదికాలంగా ప్రమోషన్లు కల్పించకుండా ఉన్నతాధికారులు అడ్డుపడుతున్నారని తెలిపారు. ప్రతినెలా జీతాలు ఇచ్చినంత మాత్రాన గొప్ప కాదని, రిటైర్డ్ ఉద్యోగులు తమ హకుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే దుస్థితి నెలకొన్నదని ధ్వజమెత్తారు. ఈ ఆందోళన ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిషరించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.