సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): వాట్సప్‌లో పరిచయం పెంచుకుంది.. వీడియోకాల్‌లో మాట్లాడింది.. ఇన్స్టాగ్రామ్ ఐడీ ఇచ్చి మాయమాటలు చెప్పింది. ఆ యువతి మాటలు నమ్మి ఆన్లైన్ బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టి రూ.13లక్షలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్ వాసి. నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు వాట్సప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ స్కామ్‌లో చిక్కుకున్నాడు. బాధితుడికి ఈ నెల 8న మిస్ ఆర్య అనే యువతి నుంచి వాట్సప్ కాల్ వచ్చింది.
అందులో తాను సఫైర్ బెట్టింగ్ క్యాసినో తరపున మాట్లాడుతున్నానని, ఆన్లైన్లో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని నమ్మించే ప్రయత్నం చేసింది. మొదట్లో బాధితుడు ఆమె మాటలు నమ్మకపోయినా, ఆర్య నుంచి రెగ్యులర్‌గా కాల్స్ రావడం, ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడీ ఇవ్వడంతో పాటు వీడియో కాల్స్ చేయడంతో అతను ఆమెను నమ్మి మొదట రూ.10వేలు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత కొంత లాభం వచ్చినట్లుగా చూపించడంతో పలుమార్లు వేర్వేరు యూపీఐ ఐడీల నుంచి రూ.13,42,778 బదిలీ చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి లాభాలు చూపించకపోగా, స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.