Hyderabad | బంజారాహిల్స్ ఏప్రిల్ 12: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. అమ్మాయి ఓకే చెప్పడంతో ఆమె నుంచి డబ్బులు తీసుకుని జల్సాలు చేశాడు. చివరకు అతని బాగోతం తెలిసి వదిలేస్తే వేధింపులకు గురిచేశాడు. రోడ్డుపై అటకాయించి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో విసిగిపోయిన బాధిత యువతి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కృష్ణా నగర్‌కు చెందిన ఓ యువతి(30) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన సుమంత్ (30) అనే యువకుడితో గత పదేళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. అతన్ని పెళ్లి చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని హాయిగా గడపాలని సదరు యువతి భావించింది. ఈ క్రమంలో సుమంత్ అడగ్గానే రూ.5లక్షల దాకా ఇచ్చింది. అయితే, ఇటీవల సుమంత్ తాగుడుకు బానిసయ్యాడు.
సుమంత్ తాగుడుకు బానిస కావడంతో అతన్ని సదరు యువతి పక్కనబెట్టింది. దీన్ని జీర్ణించుకోలేని సుమంత్ ఆమె వెంటపడి వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తనను విడిచిపెట్టాలని సదరు యువతి సుమంత్‌కు సూచించింది. అలాగే తాను ఇచ్చిన రూ.5లక్షలను కూడా తిరిగి ఇచ్చేయాలని కోరింది. కానీ ఆమె మాటలను పట్టించుకోని సుమంత్.. ఆమె వచ్చిపోయే మార్గంలో అటకాయించి వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన సదరు యువతి శనివారం నాడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.