అంబర్‌పేట, నవంబర్ 4: అంబర్‌పేట డీడీ కాలనీ కిడ్నాప్ కేసులో సూత్రదారి, పాత్రదారి మొదటి భార్యే అని పోలీసులు తేల్చారు. తనను, తన పిల్లల్ని చూసుకోవడంలేదని, అలాగే తనకు ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వడంలేదని పది మందితో కలిసి ఆమె భర్తను కిడ్నాప్ చేయించింది. ఈ కేసులో ప్రధాన భూమిక పోషించిన భార్య ఎం.మాధవీలతతోపాటు మరో 9 మందిని అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఈస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను డీసీపీ డా.బి.బాలస్వామి వెల్లడించారు.
అంబర్‌పేట డీడీ కాలనీలో గత నెల 29 న మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. ఆ సమయంలో శ్యామ్‌కు అతడి రెండో భార్య ఫాతిమా ఫోన్ చేయగా… ఎవరో గుర్తు తెలియని మహిళ లిఫ్ట్ చేసి ఫోన్ మౌలాలిలో దొరికిందని చెప్పింది. అక్కడికి వెళ్లి ఆ ఫోన్ తీసుకొని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు.. టెక్నికల్ సపోర్టులతో కిడ్నాపర్లను వెంబడించారు. కిడ్నాపర్లు రెంట్‌కు తీసుకున్న కారును చెర్లపల్లి వద్ద వదిలి వెళ్లిపోయారు. రూ.30లక్షలు కావాలని డిమాండ్ చేశారని.. అదే సమయంలో శ్యామ్ తన స్నేహితుడు రఘునాథ్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు.
గత నెల 31న బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంకులో మంత్రి శ్యామ్ డబ్బులు డ్రా చేయడానికి వచ్చి తప్పించుకొని పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు తెలియజేశాడు. ప్రధాన నిందితురాలు ఎం.మాధవీలత అమెరికాలో శ్యామ్‌తో వివాహం చేసుకొని పదేళ్లపాటు అక్కడే ఉన్నారు. అయితే అమెరికాలోనే వీరు విడాకులు కూడా తీసుకున్నారు. అనంతరం 2005లో హైదరాబాద్‌కు వచ్చి 2022 వరకు మళ్లీ ఇద్దరు కలిసి ఉన్నారు. గత మూడేండ్లుగా మళ్లీ దూరం ఉంటున్నారు. దీంతో మంత్రి శ్యామ్ ఫాతిమాను రెండో పెండ్లి చేసుకొని తన పేరును శ్యామ్‌కు బదులు అలీగా మార్చుకున్నాడు. డీడీ కాలనీలో గల కృష్ణ తేజ రెసిడెన్సీలో నివాసముంటున్నాడు.
రెండు నెలల కిందట బంజారాహిల్స్‌లో గల తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని రూ.22 కోట్లకు విక్రయించాడు. ఆ సమయంలో మాధవీలత తనను, తన పిల్లలను సరిగ్గా చూసుకోవడంలేదని శ్యామ్‌పై కక్ష గట్టి ఈ కిడ్నాప్‌నకు ప్లాన్ చేసింది. అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన దుర్గా వినయ్, రాంనగర్ నివాసి కట్ట దుర్గాప్రసాద్ అలియాస్ సాయితో కలిసి మాధవీలత కిడ్నాప్ ప్లాన్ చేశారు. రాంనగర్‌కు చెందిన దుర్గాప్రసాద్, విద్యానగర్‌కు చెందిన కాటమోని పురుషోత్తం, పురానాపూల్‌కు చెందిన సందోలు నరేష్కుమార్, ఆగాపురకు చెందిన కోశకోలు పవన్‌కుమార్, మంఘల్‌హాట్ నివాసి నారాయణ రిషికేష్‌సింగ్, అంబర్‌పేట పటేల్‌నగర్‌కు చెందిన పిల్లి వినయ్‌లతో టీమ్‌ను ఏర్పాటు చేశారు.
కూకట్‌పల్లికి చెందిన బౌన్సర్ జి.ప్రీతిని, మలక్‌పేటకు చెందిన ఎల్.సరిత ఇద్దరిని కిడ్నాప్ చేయడానికి రెండు రోజుల ముందు డీడీ కాలనీ కృష్ణ తేజ రెసిడెన్సీలో రెంట్‌కు దించారు. ఈనెల 29 న మంత్రి శ్యామ్‌ను బలవంతంగా కారులో తీసుకొని కిడ్నాప్ చేశారు. ఈ కేసులో ప్రమేయమున్న పది మందిని అరెస్టు చేశామని, మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ కేసును అంబర్‌పేట ఇన్స్పెక్టర్ టి.కిరణ్‌కుమార్, డీఐ మహ్మద్ హఫీజుద్దీన్ నేతృత్వం వహించారు. ఎస్సై జి.సురేశ్‌కుమార్ దర్యాప్తు చేశారు.