సిటీబ్యూరో/బండ్లగూడ, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వాహనాలు దొంగిలిస్తూ సామాన్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలపై సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక నజర్ పెట్టారు. ఇటీవల ద్విచక్రవాహనాలు ఎక్కువగా చోరీకి గురవుతుండటంతో సీసీఎస్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో మైలార్‌దేవ్‌పల్లి, టప్పాచబుత్ర, నిజామాబాద్, ఫిల్మ్‌నగర్, ఐఎస్ సదన్, కొత్తూర్ ఠాణాల పరిధిలో జరిగిన 11 కేసులను ఛేదించి.. నిందితుల నుంచి 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
శాస్త్రీపురం, జామామసీదు ప్రాంతానికి చెందిన మహ్మద్ అఖిల్‌ఖాన్ అలియాస్ అమెర్(24), ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్ ముజమిల్ అలియాస్ ముజ్జు(19), మోయిజ్, నాందేడ్‌కు చెందిన సోహెల్, శాస్త్రీపురానికి చెందిన మీర్ షోయబ్ అలీ ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఇంటి ముందు, ఇతర ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా.. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన సలీం జూలై 23వ తేదీ రాత్రి తన ఇంటి ముందు ద్విచక్రవాహనాన్ని పార్క్ చేశాడు. మరుసటి రోజు ఉదయం చూడగా వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ సీసీఎస్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కలిసి బుధవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే అఖిల్ ఖాన్, ముజ్జు పట్టుబడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ.5.95లక్షల విలువైన 11 ద్విచక్రవాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు.