సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు సాంకేతిక కారణాలతో మళ్లీ ఆగింది. ఈ మధ్య కాలంలో తరచూ ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా శుక్రవారం ఉదయం నాగోల్-రాయదుర్గం మార్గంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు స్టేషన్ దగ్గర రెండువైపుల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు 30 నిమిషాలకు పైగా వేచి చూడాల్సి వచ్చింది.
అమీర్‌పేట-రాయదుర్గం మార్గంలో నిత్యం వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా ఆ మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లు విపరీతమైన రద్దీతో ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే మెట్రో రైళ్లు ఆగిపోతుండటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. నిర్వహణలోపం, మెట్రో అధికారులు అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.