సిటీబ్యూరో, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా నకిలీ ఔషధాలు విక్రయిస్తున్న ఒక ఘరానా ముఠా గుట్టును రట్టుచేసి, వారి వద్ద నుంచి రూ.26లక్షల విలువైన నకిలీ మందులను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డీసీఏ అధికారుల కథనం ప్రకారం..కొరియర్ ద్వారా నగరానికి నకిలీ మందుల పార్సిళ్లు వచ్చినట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు డీసీఏ అధికారులు శుక్రవారం నగరంలోని ఉప్పల్, దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లోని ‘ట్రాకన్ కొరియర్ ప్రై.లి’ కార్యాలయాలపై దాడులు జరిపారు. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన రెండు పార్సిళ్లను పరిశీలించగా..ఒక పార్శిల్లో 14.5కిలోలు, మరో పార్సిల్లో 13 కిలోల బరువుతో గుర్తు తెలియని పదార్థాలు కన్పించాయి. వాటిపైన ‘మెషిన్ పార్ట్స్’ అని, పార్సిళ్లపైన పువ్వాడ లక్ష్మణ్ అని పేర్కొనడంతోపాటు అతడి ఫోన్ నంబర్ కూడా పేర్కొని ఉన్నది. దీంతో పోలీసుల సాయంతో ఫోన్ నంబర్ ఆధారంగా పువ్వాడ లక్ష్మణ్‌ను గుర్తించి, దిల్‌సుఖ్‌నగర్‌లోని శివగంగా థియేటర్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ నకిలీ ఔషధాల సరఫరాలో నగరంలోని సైదాబాద్‌కు చెందిన పోకల రమేశ్, గరపల్లి పూర్ణచందర్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు తేలింది. వీరంతా ఉత్తరాఖండ్‌లోని నదీమ్ అనే వ్యక్తి నుంచి నకిలీ ఔషధాలను కొనుగోలు చేస్తున్నట్లు నిందితుడు అధికారుల విచారణలో వెల్లడించాడు.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు దిల్‌సుఖ్‌నగర్‌లోని ద్వారకాపురంలో ‘వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్’ పేరుతో ఉన్న అతడి గోదామ్తోపాటు పువ్వాడ లక్ష్మణ్, పోకల రమేశ్, గరపల్లి పూర్ణచందర్ నివాసాలపై కూడా పోలీసుల సహకారంతో డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఉత్తరాఖండ్‌లోని కాశీపుర్ నుంచి కొరియర్ ద్వారా వచ్చిన రూ.26లక్షల విలువైన 8 రకాల నకిలీ ఔషధాలను అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఈ ముగ్గురు నిందితులతోపాటు మరో వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు.
నిందితుల వద్ద బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్‌తో నకిలీ ఔషధాలు బయటపడినట్లు డీఏసీ వెల్లడించింది. సన్ ఫార్మా పేరుతో అధిక కొలెస్ట్రాల్‌కు వినియోగించే ‘రొసువ’ ఔషధాలు, గ్లెన్‌మార్క్ ఫార్మా పేరుతో హైపర్ టెన్షన్‌కు వినియోగించే ‘టెల్మా-హెచ్ మాత్రలు, అరిస్టో ఫార్మస్యూటికల్ పేరుతో ‘మోనోసెఫ్-ఒ’ మాత్రలు, టొర్రెంట్ ఫార్మా పేరుతో పెయిన్ రిలీఫ్, వాపు తగ్గేందుకు వినియోగించే ‘ఖిమోరల్ ఫొర్ట్’ వంటి ఔషధాలను గుర్తించారు.
నకిలీ ఔషదాల రాకెట్ గుట్టును రట్టు చేసిన తెలంగాణ డీసీఏ అధికారులు ఉత్తరాఖండ్ డ్రగ్‌కంట్రోల్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నకిలీ ఔషధాల బాగోతాన్ని వారికి వివరించినట్లు తెలంగాణ డీసీఏ అధికారులు తెలిపారు. డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు అసిస్టెంట్ డైరెక్టర్ అంజుమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు బి.లక్ష్మీనారాయణ, వి.రవికుమార్, జి.అనిల్, ఎఎన్.క్రాంతికుమార్, ఎల్.రాజు, జె.నాగరాజు పాల్గొన్నారు.