Hyderabad | హిమాయత్ నగర్, జూలై 3 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో క్లీన్ అండ్ గ్రీన్‌గా రూపుదిద్దుకున్న భాగ్యనగరం కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా పేరుకు పోయిన చెత్త కుప్పలే దర్శన మిస్తున్నాయి. హిమాయత్ నగర్ డివిజన్లో రోజుల తరబడి చెత్తా, చెదారం తొలగించక పోవడం, రోడ్ల పక్కన వ్యర్థాలను వేస్తున్న పట్టించుకోక పోవడంతో బస్తీలు, కాలనీలు, రవాదారులు కంపు కొడుతున్నాయి. బస్తీలు, కాలనీల్లో రోడ్లు శుభ్రం చేసే ప్రక్రియ సక్రమంగా నిర్వహించక పోవడంతో ఎక్కడ చూసినా చెత్తా చెదారం కనిపిస్తుందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన చెత్తకుప్పల వల్ల దుర్వాసన వెదజలడం వల్ల దోమలు, ఈగలు వ్యాపించి తద్వారా మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త, చెదారంను ఇండ్లలో నుంచి తీసుకు వచ్చి పారిశుద్ధ్య సిబ్బంది రోడ్లపై వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా హిమాయత్ నగర్, విఠల్వాడి, నారాయణగూడ, హైదర్గూడతో పాటు బస్తీలు, కాలనీలలో చెత్తా చెదారం, నిర్మాణ వ్యర్థాలు, చెట్ల కొమ్మలతో అపరిశుభ్రకరమైన వాతావరణం నెలకొంది. చెత్తసమస్యపై నిత్యం పలుమార్లు స్థానికులు పారిశుద్ధ్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ కోసం లక్షలాది రూపాయాలను జీహెచ్ఎంసీ ఖర్చు చేస్తున్నప్పటికి చెత్త సమస్య పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధి కారులు స్పందించి పేరుకు పోయిన చెత్తను తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
వెంటనే చర్యలు తీసుకుంటాం..
బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. తడి,పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందించాలని ప్రజలకు తెలియజేస్తున్నాం. కొంతమంది స్థానికులు డస్ట్ బిన్లో వేయకుండా రోడ్డుపైనే చెత్త వేసి వెళ్లుతున్నారు. జీవీపీ పాయింట్ల వద్ద డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. బస్తీలు, కాలనీలు పరిశుభ్రంగా ఉంచి సంపూర్ణ స్వచ్ఛత కోసం చర్యలు తీసుకుంటున్నాం.
అంబర్‌పేట సర్కిల్-16 ఏఎంహెచ్‌వో డాక్టర్ హేమలత