Musi Project | సిటీబ్యూరో, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : లక్షన్నర కోట్ల ప్రాజెక్టు… 1500 కోట్లు కేటాయింపు. దశల వారీగా పెరిగిన లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ థేమ్స్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతామంటూ చెప్పుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు నిధుల కోసం తండ్లాడుతోంది. చేతి నిండా డబ్బులు లేకున్నా… బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి.. ప్రయోజనాలు లేని మూసీలో కుమ్మరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే మూడు నెలల్ల్లో వ్యవధిలో లక్ష కోట్లకు అంచనా వ్యయం పెంచడంపై ఆర్థిక, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, కనీసం తాగునీటి అవసరాలనూ తీర్చలేని మూసీ పేరిట అప్పులు తెచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం చక్కర్లు కొడుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. 55 కిలోమీటర్లు మేర విస్తరించిన మూసీ నది సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్లు ఖర్చు చేసేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటోంది.
భారీ అంచనా వ్యయానికి తగినట్లు బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించి… మూసీ పేరిట అప్పులు తెచ్చే పనిలో పడింది. దశల వారీగా మూసీని డెవలప్ చేస్తామంటూనే ప్రాజెక్టు కోసం భారీగా ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ నుంచి రూ. 5వేల కోట్ల నిధులను కోరుతోంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం… ప్రపంచ బ్యాంక్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.
కేటాయింపులు లేవు..
లక్షన్నర కోట్లతో మురుగునీరు ప్రవహించే మూసీని మెరిపిస్తామని చెప్పిన ప్రభుత్వం… తాజాగా బడ్జెట్లో అత్తెసరు నిధులతో సరిపెట్టింది. కేవలం రూ. 1500 కోట్లను కేటాయించి వాటితోనే బృహత్తరమైన ప్రణాళికలను రూపొందించేందుకు ఖర్చు చేస్తామని వ్యాఖ్యానించింది. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులకు ఐనానిక్గా మూసీని తీర్చిదిద్దుతామని చెబుతూనే ప్రాజెక్టును అప్పులు చేసి మొదలుపెట్టనున్నది.
తక్కువ ఖర్చులోప్రాజెక్టును చేపట్టేలా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు గతంలోనే దాదాపు రూ.16వేల కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను కూడా కాంగ్రెస్ సర్కారు పక్కనపెట్టేసింది. కనీసం బడ్జెట్లోనైనా భారీ మొత్తంలో కేటాయింపులు చేయకుండా అప్పులతోనే ప్రాజెక్టును చేపట్టేలా రేవంత్ సర్కారు యోచిస్తోంది. కానీ ప్రభుత్వం చేయి చాచినంత వేగంగా అక్కడి నుంచి స్పందన లేదని, వరల్డ్ బ్యాంక్ ప్రాధాన్యతలు వేరే అంశాలపై ఉన్నాయని తెలుస్తోంది.
చంద్రబాబు తరహాలో..
మూసీ నది పేరిట భారీ మొత్తంలో ప్రపంచ బ్యాంక్ నుంచి నిధుల సమీకరణపై ఆర్థిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఆర్థిక సాయం పేరిట నిబంధనలను పాటించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే మూసీ కోసం వరల్డ్ బ్యాంక్‌ను ఆశ్రయించడం వెనుక వేరే ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరిట భారీ మొత్తంలో నిధుల సమీకరించుకునే క్రమంలో… ముందుగా మూసీ సుందరీకరణతో వరల్డ్ బ్యాంక్ వైపు అడుగులు వేసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
పదేండ్లలో ఏనాడూ వరల్డ్ బ్యాంక్ సాయం అందిన దాఖాలాలు లేని సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు తరహాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అసలు మూసీ పేరిట ఇంతగా కసరత్తు చేయాల్సిన అవసరమే లేదని, ముందుగా తక్కువ వ్యయంతో మూసీని పరిరక్షించుకునేలా ప్రణాళికలపై దృష్టి పెట్టాలని సామాజిక, ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.