సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరనుండడంతో ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు తమ రోజు వారి విధి నిర్వహణపై దృష్టి సారించారు. ప్రస్తుతం డిసెంబర్ నెల కావడంతో ఈ ఏడాది జరిగిన నేరాలకు సంబంధించిన క్రైమ్ రికార్డులను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది పండుగలు, సభలు, సమావేశాలు, ఎన్నికల బందోబస్తుకు ఎక్కువగా సమయం కేటాయించారు.
ప్రతి ఏడాది డిసెంబర్ 20వ తేదీ తరువాత ఆయా పోలీస్ కమిషనర్లు తమ పరిధిలో జరిగిన నేరాలకు సంబంధించిన వార్షిక నివేదికను విడుదల చేస్తుంటారు. ఇందులో భాగంగానే క్రైమ్ రికార్డ్సు బ్యూరో ఆయా నేరాలు, కేసులకు సంబంధించిన అంశాలపై విశ్లేషణలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా విభాగాల అధికారులు వార్షిక నివేదిక తయారీపై కసరత్తు మొదలు పెట్టారు. ఈ వార్షిక నివేదికను విడుదల చేసేది కొత్త అధికారులా? ప్రస్తుత అధికారులా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత రానున్నది.