గంటకు 6 టన్నుల మిథేన్
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు విషం చిమ్ముతోంది.. నగరవాసుల ఊపిరిని ఆడనీయకుండా చేస్తోంది.. ఇక్కడి డంపింగ్ యార్డు నుంచి గంటకు ఏకంగా 6 టన్నుల మిథేన్ గాలిలో కలుస్తోంది.
- 10 లక్షల కార్ల పొగతో సమానం
- చిమ్ముతున్నడంపింగ్ యార్డ్
- అత్యధిక కాలుష్య సిటీల్లో హైదరాబాద్ 4వ స్థానం
- యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అధ్యయనంలో వెల్లడి
- విషపూరితంగా 25 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు
- మరో 30 కి.మీల మేరలో పెరిగిన వాయు కాలుష్యం
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు విషం చిమ్ముతోంది.. నగరవాసుల ఊపిరిని ఆడనీయకుండా చేస్తోంది.. ఇక్కడి డంపింగ్ యార్డు నుంచి గంటకు ఏకంగా 6 టన్నుల మిథేన్ గాలిలో కలుస్తోంది. ఇది దాదాపు 10 లక్షల కార్లు ఒకేసారి రోడ్డు మీదకు వచ్చి విడుదల చేసే పొగతో సమానమంటూ.. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (యూసీఎల్ఏ) అధ్యయనం షాకింగ్ విషయాలు వెల్లడించింది. అత్యధిక కాలుష్య నగరాల్లో మొదటి మూడు స్థానాల్లో బ్యూనోస్ ఏరీస్, జకర్తా, కౌలాలంపూర్ ఉంటే హైదరాబాద్ 4వ స్థానంలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. జవహర్‌నగర్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా.. వ్యర్థాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
డంపింగ్ యార్డుకు రోజూ దాదాపు 11వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తున్నది. దుర్వాసన, కాలుష్యంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. రోగాల బారినపడుతున్నారు.. 25 కిలోమీటర్ల భూగర్భ జలాలు విషపూరితంగా మారాయి. డంపింగ్ యార్డును తరలించాలంటూ.. అన్ని వర్గాలు ఎన్ని పోరాటాలు చేసినా..ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ఈ నేపథ్యంలో తాజా నివేదిక అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సర్కార్ నిర్లక్ష్యంపై పర్యావరణవేత్తలు, వివక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జవహర్‌నగర్ విషపు కోరల నుంచి ప్రజలను విముక్తి కల్పించేందుకు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ)చెత్తతో విష వాయువుల నిలయంగా మారి, లక్షలాది మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై విపక్ష పార్టీల నేతలతో పాటు పర్యావరణ వేత్తలు పోరుబాటకు సన్నద్ధమయ్యారు. జవహర్‌నగర్ బాధితులు, పర్యావరణ వేత్తలు, మేధావులను కలుపుకుని ఈ విషపు కోరల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందుకు ప్రధాన కారణం అత్యధిక కాలుష్య నగరాల్లో హైదరాబాద్ నగరం నాలుగో స్థానంలో నిలవడం…జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి గంటకు 6 టన్నుల మిథేన్ వెలువడడమే… మొదటి మూడు నగరాలు బ్యూనోస్ ఏరీస్, జకర్తా, కౌలాలంపూర్ నగరం ఉంటే హైదరాబాద్ నగరం 4వ స్థానంలో ఉందంటూ అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా(యుసీఎల్‌ఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో విస్తుపోయే నిజాలను వెల్లడించింది.
జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి మిథేన్ వాయువుకు ప్రధాన కేంద్రంగా మారిందని, ఈ యార్డు నుంచి ప్రతి గంటకు ఏకంగా 6 టన్నుల మిథేన్ గాలిలో కలుస్తోందని ఈ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న 25 నగరాల జాబితాను పరిశీలించగా, హైదరాబాద్ ఏకంగా నాలుగో స్థానంలో ఉండటం నగర మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నది. ఈ కాలుష్య తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే. దాదాపు 10 లక్షల కార్లు ఒకేసారి రోడ్డు మీదకు వచ్చి పొగను విడుదల చేస్తే ఎంతటి ప్రమాదం పొంచి ఉంటుందో, కేవలం జవహర్ నగర్ యార్డు నుంచి విడుదలయ్యే మిథేన్ వల్ల అంతటి నష్టం జరుగుతోందని నివేదికలో లెకగట్టారు.
కార్బన్ డైయాక్సైడ్ కంటే మిథేన్ వాయువు పర్యావరణానికి 80 రెట్లు ఎకువ హానికరమని, ఇది గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరంగా దేశానికే గర్వకారణంగా ఉండాల్సిన మహానగరాలు.. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో అత్యంత కాలుష్యకారక నగరాల జాబితాలో నిలిచాయి. హైదరాబాద్‌లోని జవహర్ నగర్, ముంబైలోని కంజుర్ మార్గ్ ప్రపంచంలోనే అత్యధికంగా మిథేన్ వాయువును విడుదల చేస్తున్న మొదటి 25 సైట్లలో ఉన్నాయి.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్, స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్ పేరుతో నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లోని 25 వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు విపరీతమైన మిథేన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జవహర్ నగర్ ల్యాండ్ ఫిల్ నుంచి ప్రతి గంటకు ఏకంగా 6 టన్నుల మిథేన్ విడుదలవుతోంది. దీంతో ఈ జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచి డర్టీ సిటీగా ముద్ర వేయించుకుంది. ఇక ముంబైలోని కంజుర్ మార్గ్ గంటకు 4.9 టన్నుల ఉద్గారాలతో 12వ స్థానంలో ఉంది. 2025లో కీలక శాటిలైట్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 700 వ్యర్థాల కేంద్రాల నుంచి వెలువడే 3,000 ప్లూమ్స్ (పొగ మేఘాలు)ను పరిశీలించిన తర్వాత ఈ 25 కేంద్రాలను గుర్తించారు.
ఈ జాబితాలో భారత్‌తో పాటు బ్రెజిల్, చిలీ, సౌదీ అరేబియా, టరీ వంటి దేశాలు కూడా ఉన్నాయి. ‘ఈ గణాంకాలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక లాంటిదని, వ్యర్థాల నిర్వహణ రంగంలో తక్షణ మార్పులు తీసుకురావడానికి ఈ డేటా ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుందని నివేదికలో వెల్లడించారు. కాగా ఈ అధ్యయన ఫలితాలపై పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు కలుషితమై జనం రోగాల బారిన పడుతుంటే, ఇప్పుడు గాలిలో కలుస్తున్న మీథేన్ వల్ల శ్వాసకోస వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలొని శాస్త్రీయ పద్ధతుల్లో చెత్త శుద్ధి ప్రక్రియను చేపట్టకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ ఊపిరి పీల్చుకోవడం దుర్లభంగా మారుతుందని పర్యావరణవేత్తలు, స్థానిక జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న డంపింగ్
జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.. గడిచిన మూడేండ్లలో చెత్త నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది. జవహర్ నగర్‌కు రోజూ దాదాపు 11వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మూడు కార్పొరేషన్ల చెత్తను ఒక్క జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకే తరలిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలైన డంపింగ్ యార్డులు (ప్రాసెసింగ్ యూనిట్లు, లక్డారం, ప్యారానగర్, ఖానాపూర్) నెలకొల్పకుండా..సదరు రాంకీపై సర్కార్ ఆధారపడిన తీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణ చేయడంలో సదరు రాంకీ సంస్థ విఫలమైందని, ఎన్జీటీ సంస్థలు మొట్టి కాయలు వేశాయి. అక్కడ కుళ్లిన చెత్త వాసనతో , కాలుష్యంతో స్థానికులు రోగాలబారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుండగా, తాజా నివేదిక అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సర్కార్ నిర్లక్ష్యంపై ఆగ్రహం
ప్రస్తుత సమాజంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వినియోగించడంలో విఫలమైందని విపక్ష పార్టీల నేతలు, పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. చెత్త డంపింగ్లను శాస్త్రీయంగా నిర్వహించేందుకు, జీరో పొల్యూషన్ సాధించేందుకు టెక్నాలజీని ఐఐటీ బాంబే అందజేసిన ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు కోటి 60 లక్షల మందికి సంబంధించిన చెత్తను ఇక్కడను తరలిస్తున్నారని, డంపింగ్ యార్డు చుట్టూ 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యంగా మారాయని పేర్కొన్నారు.
మరో 30 కిలోమీటర్ల రేడియస్‌లో వాయు కాలుష్యం పెరిగిపోయి ప్రజలు తీవ్రమైన ఊపిరితిత్తులు, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు, కూరగాయలు అమ్ముకునే వారు నిత్యం కష్టపడి సంపాదించే ప్రతి పైసాను ఆసుపత్రుల పాలై ఆరోగ్యం కోసం తగలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకోవడం తప్ప సమస్యకు పరిష్కారం చూపడం లేదని. నగరానికి నాలుగు దిక్కులా చెత్త నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంపై భారాన్ని తగ్గించాలని అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

