సిటీబ్యూరో, జనవరి 9(నమస్తే తెలంగాణ): రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలతో నష్టపోతున్న బాధితులు తక్షణ సహాయం పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి దేశంలోనే తొలిసారిగా సైబర్ మిత్రను తీసుకొచ్చినట్లు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ మిత్ర(సీ-మిత్ర) ప్రత్యేక సెల్‌ను శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో సజ్జనార్ ప్రారంభించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు కూడా కొత్త రూపు సంతరించుకుంటున్నాయని, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాల వంటివి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని సజ్జనార్ అన్నారు.
ఇలాంటి క్లిష్ట సమయాల్లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో లేదా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ముఖ్యంగా వయస్సు పైబడిన వారు, ఉద్యోగాలు లేదా ఇతర కారణాలతో సమయం కేటాయించలేని వారు ఫిర్యాదు పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేస్తున్నారని, ఇంకొంతమంది తమ బంధువుల దగ్గర పరువు పోతుందని బాధపడుతున్నారని చెప్పారు.

వీటన్నిటికీ పరిష్కారంగా బాధితులకు అండగా నిలుస్తూ వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే శ్రమ లేకుండా త్వరితగతిన న్యాయం అందించేందుకు బాధితులు ఫిర్యాదు చేయడం మొదలుకొని ఎఫ్ఐఆర్ నమోదయ్యే వరకు అంతా ఇంటినుంచే పూర్తయ్యేలా సాంకేతికత ద్వారా పోలీసులే మీ వద్దకు వర్చువల్‌గా వచ్చేదే సైబర్ మిత్ర అని సజ్జనార్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో బాధితులను సెల్ సిబ్బంది స్వయంగా ఫోన్ ద్వారా సంప్రదించి ఫిర్యాదు వివరాలు సేకరిస్తారని, అవసరమైతే ఫిర్యాదును పోస్టు ద్వారా లేదా డ్రాప్ బాక్స్ ద్వారా కూడా స్వీకరిస్తారని ఆయన చెప్పారు.
సైబర్ మిత్ర సెల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తారని, ఆపై ఆయా పోలీస్స్టేషన్లు 24 గంటల్లోపు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దాని కాపీని బాధితులకు అందజేస్తాయని, ఈ విధానంతో ఫిర్యాదు ప్రక్రియ వేగవంతమవుతుందని సైబర్ పోలీసులు తెలిపారు. సెల్‌ను ప్రారంభించిన అనంతరం సైబర్ మిత్ర పనితీరు, బాధితులు వస్తే ఎలా సహకరిస్తారనే అంశాలపై సీపీ సజ్జనార్ అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు, డీసీపీలు అరవింద్‌బాబు, అపూర్వారావు, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కారె కిరణ్‌ప్రభాకర్, రూపేశ్, వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్స్ ఏసీపీ శివమారుతి తదితరులు పాల్గొన్నారు.