సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాబోయే ఎన్నికలు, గణేశ్ నవరాత్రులు, మిలాద్ ఉన్ నబీ వంటి ప్రధాన బందోబస్తుపై మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా బందోబస్తులో పాల్గొనే వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. సిటీ ఆర్మూడ్ రిజర్వు ఫోర్స్, సాయుధ బలగాల విస్తరణ, లాజిస్టిక్స్, ప్లీట్ మేనేజ్మెంట్, శాంతి భద్రతల నిర్వహణ, కీలకమైన ఇన్‌స్టాలేషన్స్, వీఐపీలకు భద్రత అందించడంలో సివిల్ పోలీసుల సహాయం, హోంగార్డ్సు, మౌంటెడ్ యూనిట్లు, డాగ్‌స్కాడ్ తదితర విభాగాలకు సంబంధించిన అంశాలపై సీపీ సమీక్ష నిర్వహించారు. సీఎస్‌డబ్ల్యూ విభాగం వీఐపీలకు భద్రత కల్పిస్తుంది.
సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది ఆరోగ్యం, క్రమశిక్షణ ముఖ్యమని, సీఎస్‌డబ్ల్యూ సిబ్బందికి పని, పరిస్థితులను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తామన్నారు. మౌంటెడ్ పోలీస్ యూనిట్‌ను సీపీ సందర్శించారు. ఈ యూనిట్లో 46 గుర్రాలు, 26 పోలీసు జాగిలాలు ఉన్నాయి. వాటి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి, అక్కడున్న పశు వైద్యులకు పలు సూచనలు చేశారు. హోంగార్డు కమాండెంట్ కార్యాలయాన్ని సందర్శించి.. అక్కడి రికార్డులను సీపీ పరిశీలించారు. ట్రాఫిక్ నిర్వహణలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తుండటంతో వారి సేవలను సీపీ కొనియాడారు. ఈ సందర్భంగా ఆ ప్రాంగణంలో క్యాంటిన్‌ను సీపీ ప్రారంభించారు. సిబ్బందికి 24/7 క్యాంటిన్ అందుబాటులో ఉంటుందన్నారు. సీపీ వెంట జాయింట్ సీపీ ఎం.శ్రీనివాసులు(కార్ అండ్ ట్రైనింగ్), సీఎస్‌డబ్ల్యూ డీసీపీ అలెక్స్, ఇతర అధికారులు ఉన్నారు.