సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మహిళలు నిర్భయంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. గత 15రోజుల్లో 110 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని తెలిపారు. పట్టుబడ్డ వారికి రాచకొండ ఉమెన్ సేఫ్టీవింగ్, షీ టీమ్స్ డీసీపీ ఉషారాణి బృందం కౌన్సెలింగ్ నిర్వహించిందన్నారు. పట్టుబడ్డ వారిలో 74 మంది మేజర్లు, 36 మంది మైనర్లు ఉన్నారు. ఇదిలాఉండగా వీటితోపాటు వేధింపులకు గురైన మహిళల ద్వారా 135 ఫిర్యాదులు అందాయని, అందులో ఫోన్ల ద్వారా 34, సోషల్‌మీడియా ద్వారా 48, నేరుగా 53 ఫిర్యాదులు అందాయని డీసీపీ వెల్లడించారు.
ఇందులో ప్రయాణికులపై దాడి చేసిన ఉబర్ ఆటో డ్రైవర్‌పై క్రిమినల్ కేసు, సోషల్‌మీడియా లో వేధింపులకు గురిచేసున్న మరొకరిపై, వేరువేరు ఫోన్ల నుంచి యువతిని వేధించిన మరోవ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ఈ నెల 1 నుంచి 15 వరకు 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రాచకొండ షీ టీమ్స్ డెకాయి ఆపరేషన్లు నిర్వహించి పోకిరీల ఆటకట్టిస్తున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్‌లో ఏసీపీ పల్లె వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు ముని, జి.అంజయ్య, అడ్మిన్ ఎస్సై రాజు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.