Hyderabad | హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొత్త సంవత్సరం వేడుకలను డిసెంబర్ 31న రాత్రి ఒంటి గంట లోపు ముగించాలి. పబ్‌లు, రెస్టారెంట్లతో పాటు ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి. ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీని తప్పక ఏర్పాటు చేయాలి. 45 డెసిబెల్స్‌కు మించి ఎక్కువ శబ్దం ఉండొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈవెంట్ సామర్థ్యానికి మించి పాసులు ఇవ్వొద్దని ఆదేశించారు.
న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయకూడదన్నారు. పబ్స్‌లో అశ్లీల నృత్యాలు నిషేధం అని స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడపరాదు. ఒక వేళ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా, ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తామన్నారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య సృష్టించొద్దని సూచించారు. లిక్కర్ ఈవెంట్స్‌లో మైనర్లకు అనుమతి లేదు. ఒక వేళ అనుమతిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.