బంజారాహిల్స్, జూన్ 13: బడీడుకు వచ్చిన పిల్లలను స్కూళ్లో చేర్పించాలంటూ ఒకవైపు ప్రభుత్వం బడిబాట పేరుతో కార్యక్రమాలు చేపడుతోంది. అయితే హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పంజాగుట్ట ప్రతాప్‌నగర్‌లో బస్తీ కమిటీ నేతలకు, స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల యజమాన్యానికి తలెత్తిన వివాదం కారణంగా చిన్నారులు చదువుకుంటున్న బడికి తాళాలు వేయడం వివాదాన్ని రాజేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రతాప్‌నగర్ బస్తీలోని రామాలయం ఆవరణలోని జీహెచ్ఎంసీకి చెందిన కమ్యూనిటీ హాలులో సుమారు 30 ఏళ్ల నుంచి సుశీలాదేవి మెమోరియల్ స్కూల్ పేరుతో ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. జర్నలిస్ట్ వామన్‌రావు సహకారంతో కొనసాగుతున్న ఈ పాఠశాలలో బస్తీలోని పేద పిల్లలను చేర్చుకుని నాలుగో తరగతి దాకా ఉచితంగా విద్యను అందిస్తున్నారు. అయితే 2018లో వామన్‌రావు మృతిచెందడంతో అమెరికాలో ఉంటున్న ఆయన కుమార్తె మాలతి స్కూల్ బాధ్యతలను చేపట్టారు. గతంలో ఈ స్కూల్లో 100 మంది విద్యార్థులు ఉండగా.. ఇప్పుడు 45 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. అయినప్పటికీ వీరికోసం కొంతమంది టీచర్లను పెట్టి స్కూల్‌ను నడిపిస్తున్నారు. కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం స్కూల్‌కు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి అని చెప్పడంతో సుశీల వామన్‌రావు ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్ చేసి పాఠశాలను నడిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే స్కూల్ నిర్వాహకులు, బస్తీ కమిటీ పెద్దలకు మధ్య ఇటీవల వివాదం తలెత్తింది. దీంతో తమ బస్తీ అవసరాల కోసం ఏర్పాటైన కమ్యూనిటీ హాలులో స్కూల్ నడిపించేందుకు వీల్లేదని బస్తీ కమిటీ నేతలు పట్టుబట్టారు. ఆ స్కూల్లోని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని స్కూల్ నిర్వాహకులకు లేఖ రాశారు. తమకు కొంచెం సమయమిస్తే.. అనుకూలమైన చోటు దొరకగానే ఖాళీ చేస్తామని స్కూల్ నిర్వాహకులు బదులిచ్చారు. కానీ స్కూల్ నిర్వాహకుల మాట వినిపించుకుని బస్తీ కమిటీ పెద్దలు.. వారం క్రితం కమ్యూనిటీ హాలుకు తాళం వేశారు. వేసవి సెలవులు ముగియడంతో ఇవాల్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో స్కూల్‌కు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు కమ్యూనిటీ హాలుకు భారీ తాళం కనిపించింది. దీంతో పిల్లలను బయటే కూర్చొబెట్టి పాఠాలు చెప్పారు. ఈ వ్యవహారం గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులు, మీడియాకు సమాచారం అందించారు.
కమ్యూనిటీ హాలుకు వచ్చిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్‌తోపాటు ఇతర సిబ్బంది బస్తీ కమిటీ పెద్దలతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరంగా చూసుకోవాలి తప్ప పిల్లలను రోడ్డున పడేసే హక్కులేదని తేల్చి చెప్పారు. వెంటనే తాళాలు తీయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీంతోబస్తీ కమిటీ నేతలు తాళాలను తొలగించారు. రామాలయం ఆవరణలో కమ్యూనిటీహాల్‌ను తాత్కాలికంగా తామే స్కూల్ కోసం ఇచ్చామని, అయితే బస్తీవాసుల అవసరాలకు ఉపయోగించకుండా ప్రైవేటు స్కూల్ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసుకోవడంతోనే తాము తాళాలు వేశామని బస్తీ కమిటీ నేతలు తెలిపారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీతో పాటు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తామని వారు పేర్కొన్నారు.