మల్కాజిగిరి, మే 4 : వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ డిసీసీ సురేష్ కుమార్, ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ కథనం ప్రకారం… అల్వాల్ సూర్యనగర్‌లో కనకయ్య, రాజమ్మలు భవనంలో వాచ్‌మెన్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం బంధువులు వీరికి ఫోన్ చేసినా ఎంతకు ఎత్తకపోవడంతో బంధువులు వచ్చి చూసేసరికి గదిలో వీరి మృతదేహాలు గాయాలతో పడిఉన్నాయి. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు.
హత్యకు ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల తమ స్వగ్రామం ఖమ్మం జిల్లాకు వెళ్లి వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని తెలిపారు. శనివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు సూర్యనగర్‌లో నివాసం ఉంటున్న కనకయ్య, రాజమ్మ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి కర్రలతో వారిని విచక్షణారహితంగా కొట్టి హతమార్చారు. రాజమ్మపై కర్రలతో దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాకెళ్లారు.
అనంతరం కనకయ్య పై దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. దంపతులపై కర్రలతో దాడి చేసి హతమార్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.