పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో మరణాల సంఖ్య పెరగడానికి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బాధితురాలు సంతోషి గుప్తా ఆరోపించారు. అంబులెన్స్‌లు, ఫైరింజన్లలో కనీస వసతులు లేవని, ప్రభుత్వ అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్లనే తమ కుటుంబీకులను కోల్పోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రభుత్వ వైఫల్యంపై ఆమె శుక్రవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈనెల 18న జరిగిన అగ్ని ప్రమాదంలో తన ఏడేండ్ల కుమార్తె హర్షితతో పాటు తల్లిదండ్రులు, సోదరుడు, అతని భార్య, ముగ్గురు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్ల పిల్లలు, ఆత్తామామలు, కొడుకుతో సహా కుటుంబాన్ని కోల్పోయి అనాథలా మారానని వాపోయారు.
సిటీ బ్యూరో, ఖైరతాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది, వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం వల్లే 17 మంది ప్రాణాలు కోల్పోయారని గుల్జార్ హౌస్ ఘటనలో మృతుల కుటుంబసభ్యురాలు సంతోషి గుప్తా అన్నారు. ఈ ప్రమాదం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బాధితురాలు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా వచ్చినా ఫైరింజన్లో సరైన వ్యవస్థ లేదని ఆరోపించారు. సరిపడా నీరు లేదని, వెంట వచ్చిన ఫైర్ సిబ్బంది నీటి పైపులను అమర్చుకోలేకపోయారని, అవన్నీ లీకేజీ స్థితిలో శిథిలమై ఉన్నాయని తెలిపారు. నీరు సరిపడా లేకపోవడంతో ప్రెషర్ తక్కువగా వచ్చి మంటలు వెంటనే అదుపులోకి తీసుకురాలేకపోయారని ఆరోపించారు.
సహాయ చర్యలు చేయడంలోనూ పూర్తి నిర్లక్ష్యం వహించి అక్కడికి వచ్చిన తర్వాత 42 నిమిషాలకు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారని అన్నారు. అప్పటికే తన కుటుంబ సభ్యులు మంటల్లో కాలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత సుమారు గంటా 44 నిమిషాల ఆలస్యం జరిగిందన్నారు. అప్పటికే స్థానికులతో పాటు తన కొడుకు నితీష్ లోపలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారని వివరించారు. క్షతగాత్రులను గుర్తించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది కనీసం సీపీఆర్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వసతులు లేని అంబులెన్స్‌లు.. పట్టించుకోని ప్రభుత్వ వైద్యులుగుల్జార్ హౌస్ ప్రమాద తీవ్రతకు కనీసం 10 నుంచి 20 అంబులెన్స్‌లు రావాల్సి ఉండగా నామమాత్రంగా వచ్చాయని సంతోషి గుప్తా ఆరోపించారు. వచ్చిన అంబులెన్సుల్లో ఆక్సిజన్ వ్యవస్థ లేదని, వారి వద్ద మాసులు కూడా లేవన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లాలని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముగ్గురు చిన్నారులను ఉస్మానియా దవాఖానలో చేర్పించి వెళ్లిపోయారన్నారని, వారు అప్పటికి ఊపిరి తీసుకుంటున్నారని ఆమె తెలిపారు. ఉస్మానియా డాక్టర్లు మాత్రం పోలీసులు వచ్చి చెప్పేదాకా, ఎఫ్ఐఆర్ కాపీ లేనిదే చికిత్స ప్రారంభించమని తేల్చేశారని వాపోయారు.
తన కుమారుడు ఓ వైద్యాధికారి కాళ్లు పట్టుకుని బతిలాడినా కనికరించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. సకాలంలో చికిత్స అందకపోవడం వల్లనే దవాఖానకు తీసుకొచ్చిన ముగ్గురు చనిపోయారని ఆరోపించారు. ఘటనాస్థలం నుంచి దవాఖానకు తరలించే క్రమంలో క్షతగాత్రులు కదలకుండా ఉండేందుకు అంబులెన్స్‌లోని బెడ్స్‌కు కనీసం బెల్టులు కూడా సరిగా లేవన్నారు. వైద్యాధికారులు, అంబులెన్స్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది చేసిన ఆలస్యం వల్ల యశోద దవాఖానకు తీసుకెళ్లిన ఎనిమిది మంది క్షతగాత్రులు కూడా ప్రాణాలు కోల్పోయారని ధ్వజమెత్తారు.
పక ఇంట్లో నుంచి ప్రమాదం జరిగిన ఇంట్లోకి ప్రవేశించి బాధితులను కాపాడే అవకాశం ఉన్నా ఫైర్ సిబ్బంది ఆ దిశగా చర్యలు తీసుకోలేదని, కాలయాపనతో, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. 17 మంది చావుల వెనుక ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యమే ఉందని మండిపడ్డారు. అగ్ని ప్రమాదం కంటే వారిని కాపాడే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం వల్లే చనిపోయారని నిట్టూర్చారు. అధికారులు విడుదల చేసిన ప్రకటనలన్నీ పూర్తి వాస్తవాలని కొట్టిపారేశారు. మరో 20 రోజుల్లో పుట్టినరోజు జరుపుకోవాల్సిన తన కుమార్తె హర్షిత ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని సంతోషి గుప్తా కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనలో ప్రభుత్వం, ప్రభుత్వ వ్యవస్థలన్నీ విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తామన్న పరిహారం ఇంతవరకు రాలేదని సంతోషి గుప్తా తెలిపారు. తమకు న్యాయం చేయని ప్రభుత్వాలు ఇచ్చే పరిహారం అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా క్షతగాత్రుల ప్రాణాలను కాపాడాల్సిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుని తమ లాంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకుండా ఆపాలని వేడుకున్నారు. అగ్ని ప్రమాదం, సహాయక చర్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుమారుడు నితీశ్, అతుల్ అగర్వాల్, బెజిని శ్రీనివాస్ పాల్గొన్నారు.