మళ్లీ మంత్రి వర్గ విస్తీర్ణం తెరమీదకు రావడంతో పదవి ఎవరిని వరిస్తుందోనని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్‌కు ఈ సారైన మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అనే చర్చ కూడా సాగుతున్నది. అయితే పార్టీ వర్గాల సమాచారం మేరకు ఈసారి కూడా గ్రేటర్ నాయకులకు మంత్రి పదవి దక్కడం కలగానే మిగిలిపోనున్నది. తాజా విస్తరణలోనూ గ్రేటర్‌కు మొండిచెయ్యేనంటున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్ర మంత్రిమండలిలో ప్రతి జిల్లాకు అందులో బెర్త్ ఉంటుంది.
అందునా రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌కైతే సముచిత ప్రాధాన్యత ఉంటుంది. కానీ రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినా గ్రేటర్‌కు మంత్రి పదవి కేటాయించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాగా, కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలోనూ ప్రాతినిధ్యం లభించలేదు. కంటోన్మెంట్ నుంచి శ్రీగణేశ్ ఉప ఎన్నికలో గెలిచినా.. తొలిసారి ఎమ్మెల్యే గెలవడం వల్ల.. పార్టీ సీనియర్లు గ్రేటర్ కోటా మంత్రి పదవులపై కన్నెశారు. కానీ ఆ మేరకు వారి ప్రయత్నాలు సఫలం కాకపోతుండటంతో.. వారిని అంతే బలంగా ఓ ముఖ్యనేత అడ్డుకుంటున్నట్టు జోరుగా చర్చ సాగుతున్నది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏడాదిన్నర గడిచినా గ్రేటర్లో ఒక్క అభివృద్ధి ప్రాజెక్టు రాకపోవడం బాధాకరమని నగరవాసులు చర్చించుకుంటున్నారు. – సిటీబ్యూరో, జూన్ 7 (నమస్తే తెలంగాణ)
ఉమ్మడి రాష్ట్రం నుంచి కేసీఆర్ పాలన వరకు ప్రతి ప్రభుత్వంలోనూ గ్రేటర్ హైదరాబాద్‌కు కీలక ప్రాధాన్యత ఉంటుందనేది రాజకీయ సత్యం. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీకి కనీసంగా ఒకటో, రెండు సీట్లతో రాజధాని ప్రాంతంలో ప్రాతినిధ్యం ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, టీడీపీలే కావడంతో కచ్చితంగా ఆ రెండు పార్టీలకు ప్రతిసారి కొన్ని స్థానాల్లో ఇక్కడ ప్రాతినిధ్యం దొరికేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సికింద్రాబాద్, మల్కాజిగిరి… రెండు స్థానాల్లో విజయం సాధించింది.
2018 ఎన్నికల్లో ఏకంగా పద్నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. దీంతో ఈ రెండు సమయాల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో పాటు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మరీ మంత్రివర్గంలో స్థానం కల్పించిన సందర్భాలు ఉన్నాయి. గ్రేటర్లో ఓడిన నాయకులకు ఎమ్మెల్సీలు కేటాయించి మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఆ లిస్టులో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ప్రధానంగా ఉన్నారు.
కానీ ఇటీవల ఎమ్మెల్సీ కేటాయింపుల్లోనూ వీరికి ఛాన్స్ దక్కలేదు. తాజాగా మంత్రివర్గ విస్తరణలోనైనా వీరికి పదవి వరిస్తుందా లేదా? అనేది ఇప్పుడు జోరుగా చర్చ సాగుతున్నది. అంతేకాదు రాహుల్ గాంధీ స్థాయిలో చక్రం తిప్పే పరపతి ఉన్న మధుయాష్కికి మంత్రి పదవి రాకుండా ఓ ముఖ్య నేత అడ్డుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రి పదవి కోసం మల్రెడ్డి యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. హస్తినాలో అనేకసార్లు చక్రం తిప్పుతున్నా ఆయన కోరిక మాత్రం తీరడం లేదు,.ఎలాగైనా రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా గతంలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నప్పుడు కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఆమె నుంచి భరోసా రావడంతో ఇక బుగ్గకారులో తిరగడమే తరువాయి అనుకున్నారు. కానీ ప్రతిసారీ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తున్నది. ఇదే క్రమంలో దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షీ నటరాజన్ రావడంతో మల్రెడ్డి పరిస్థితి కాస్త గందరగోళంగానే మారింది. దీంతో ఆయన సన్నిహితులతో పాటు రాష్ట్ర పార్టీ పెద్దలకు సైతం తాను గతంలో చేసిన గట్టి ప్రయత్నాల తీరును ఏకరువు పెట్టుకొని వాపోయినట్లు సమాచారం.
అనంతరం తన ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసి చివరకు అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలహారిస్ దాకా తన పైరవీలను విస్తరించడం ఆ సందర్భంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ అటు అధిష్ఠానం… ఇటు రాష్ట్ర పెద్దల నుంచి ఎలాంటి భరోసా లభించలేదు. ఈ సారైనా మంత్రి పదవి దక్కుతుందో లేదో తేల్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఓ ఉర్దూ పత్రిక ఎడిటర్ ఎమ్మెల్సీ అమర్ అలీఖాన్ కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదంటూ పార్టీవర్గాలు చెబుతున్నాయి.