మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 24: దమ్మాయిగూడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. శనివారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 13వ వార్డు బాణాయి కట్ట వద్ద రూ. 51 లక్షల హెచ్ఎండీఎ నిధులతో చేపట్టిన కల్వర్ట్, 15వ వార్డులో రూ. కోటి 12 లక్షలతో నిర్మించ తలపెట్టిన పార్కు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుండి వృద్ధులు, వివిధ మతాలు, కులాలు, రైతులు, కార్మికులకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి అందజేస్తున్నారని అన్నారు. దేశంలో 28 రాష్ర్టాలలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవని, మన తెలంగాణలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని చెప్పారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుతో జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, తదితర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా నగరం నుండి వచ్చే చెత్తతో కరెంట్‌ను తయారు చేస్తున్నారని వెల్లడించారు.
భూగర్భ జలాలు కలుషితమైనందున జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీలకు ఉచితంగా నీటిని అందించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు విన్నవించామని ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఉచితంగా నీటిని అందిస్తామని చెప్పారు. చెత్త డంపింగ్ నుండి మురుగు నీరు రాకుండా జవహర్ నగర్ నుండి దమ్మాయిగూడ, నాగారం, చర్లపల్లి చెరువు వరకు సీవరేజ్ పైప్‌లైన్ పనులకు కోట్ల రూపాయిలు కేటాయించామని వెల్లడించారు. దమ్మాయిగూడలో మున్సిపాలిటీలో సీసీ రోడ్డు, మురికి కాలువలు, వీధిదీపాలతో పాటు ఇతరత్రా అభివృద్ధి పనులకు నిధులు అందజేసి మంచి పట్టణంగా తీర్చిదిద్దుతామనిచెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, కమిషనర్ స్వామి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, హెచ్ఎండీఎ, మున్సిపల్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.