కవాడిగూడ, జూలై 21: దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు నిధులు మంజూరు చేయడం ఎంతో శుభ పరిణామని, అన్ని వర్గాల ప్రజలకు సర్కారు సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆషాఢమాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు నిధులు కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం భోలక్‌పూర్ డివిజన్‌ని దేవునితోట శ్రీ భవానీశంకర్ దేవాలయ ప్రాంగణంలో నియోజక వర్గంలోని 168 అమ్మవారి దేవాలయాలకుగాను ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 84,1700 చెక్కులను ఆలయ నిర్వాహకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బోనాల పండుగను వైభవంగా జరుపుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నామని, పండుగను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్, రాంగనగర్ డివిజన్ల కార్పొరేటర్లు గోడ్చల రచనశ్రీ, సుప్రియా నవీన్‌గౌడ్, పావని వినయ్‌కుమార్, రవిచారి, దేవాదాయ శాఖా సికింద్రాబాద్ అడిషనల్ కమిషనర్ కృష్ణ, పలు ఆలయాల కార్యనిర్వహణాధికారులు కే. సాంబశివరావు, రఘు, ఏజీకే కృష్ణ, టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, టీఆర్ఎస్ ఆరు డివిజన్ల అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్ తదితర నాయకులు పాల్గొన్నారు.