వెంగళరావునగర్, మే 6: టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో ఛాతి దవాఖాన అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతి వైద్యశాలలో రూ.2.15 కోట్ల వ్యయంతో సిటీ స్కాన్ విభాగాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌తో కలిసి మంత్రి హరీష్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. టిమ్స్ ఏర్పాటుతో పడకలు తగ్గిపోయే అవకాశం ఉన్న దృష్ట్యా ఛాతి దవాఖానకు ప్రత్యేక భవనాన్ని కేటాయించాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, టిమ్స్‌లో రెండు అంతస్థులను ఛాతి దవాఖానకు ఉపయోగించుకోచ్చు కదా.. అంటూ సూచించారు. అయితే, ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ ఛాతి దవాఖానకు స్వతంత్య్ర హోదాలో పనిచేసే టిమ్స్‌లో స్థలం కేటాయించడం వల్ల ఇబ్బందులుంటాయని వైద్యాధికారులు తెలిపారు. అయితే, త్వరలో ఈ విషయమై తగిన నిర్ణయం తీసుకుంటామని అవసరమైతే మరోసారి దవాఖాన అధికారులతో సమావేశమై ఛాతి దవాఖాన అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందిస్తానని హామీ ఇచ్చారు. ఆధునిక వైద్య సేవలను పేద ప్రజల దరికి చేర్చే ఉద్దేశంతో నగరంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు నిర్మాణం జరుగుతున్నాయన్నారు.
ప్రభుత్వ దవాఖానాల్లో కూడా అన్ని వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎన్నో ఏండ్లుగా ఛాతి దవాఖానాలో సిటీ స్కాన్ సెంటర్ లేదని, ప్రజలకు సేవలందించాలని అడగిన వెంటనే సిటీ స్కాన్ సెంటర్ యంత్రాన్ని సమకూర్చామని చెప్పారు. అనంతరం, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఛాతి ప్రభుత్వాసుపత్రిని విస్మరించాయని పేర్కొన్నారు. సిటి స్కాన్ కోసం గతంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రోగులు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడా అవసరం లేదని అన్నారు. కరోనా కాలంలో వేల మంది రోగులకు వైద్య సేవలందించి వైద్యులు కాపాడారని అన్నారు. వయోధికుల కీళ్ల నొప్పులు, కీళ్ల మార్పిడికి శస్త్ర చికిత్సలను నిర్వహించేందుకు మెగా హెల్త్ క్యాంప్‌ను త్వరలో నిర్వహిస్తామన్నారు.
ఛాతి దవాఖానకు వచ్చే రోగులు, వారి సహాయకులకు రూ.5కే నాణ్యమైన భోజన వసతి సౌకర్యాన్ని దవాఖాన గేటు ముందే ఈ నెల 12వ తేదీన ఏర్పాటు చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేష్ రెడ్డి, వెంగళరావునగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, వైద్యాధికారులు డాక్టర్ ప్రమోద్, డాక్టర్ నరేందర్, డాక్టర్ సునీతా బజాజ్ తదితరులు పాల్గొన్నారు.