సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఫతుల్లాగూడలో ఇటీవల పెంపుడు జంతువుల క్రిమిటోరియం(దహన వాటిక) ఏర్పాటు చేశారు. తాజాగా మరో ఐదుచోట్ల పెంపుడు జంతువుల దహన వాటికల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 6న రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నాగోల్ సరిల్లోని ఫతుల్లాగూడలో జీహెచ్ఎంసీకి చెందిన జంతు సంరక్షణ కేంద్రంలో పీపుల్ ఫర్ అనిమల్స్(పీఎఫ్ఏ) సహకారంతో పెంపుడు జంతువుల శ్మశాన వాటికను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మిగతా జోన్లలో కూడా జోన్‌కు ఒకటి చొప్పున ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వీధి కుకలు, కోతులు, పశువుల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
వీధి కుకల నియంత్రణకు అనిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ద్వారా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, యాంటీ రేబిస్ టీకాలు లాంటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం నగర వ్యాప్తంగా 5 అనిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 39 వాహనాలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫతుల్లాగూడలో పీపుల్ ఫర్ అనిమల్స్(పీఎఫ్ఏ) వారు రూ. 51.25 లక్షలతో అవసరమైన యంత్రాలు కొనుగోలు చేశారు. జీహెచ్ఎంసీ ద్వారా మరో రూ. 33.50 లక్షల వ్యయంతో సదుపాయాలు కల్పించారు. దీంతో అకడ అన్ని వసతులతో పెంపుడు జంతువుల శ్మశానవాటిక సిద్ధం చేశారు. ఈ కేంద్రాన్ని స్వచ్ఛంద సంస్థ నామమాత్రపు రుసుముతో పెంపుడు జంతువులను ఎల్పీజీ గ్యాస్‌తో భస్మీకరణ చేస్తారు.
కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నియమ నిబంధనల మేరకు ఎలాంటి కాలుష్యం లేకుండా సున్నా ఉద్గారాలతో శాస్త్రీయ పద్ధతిలో పెంపుడు జంతువులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు జరుపుతారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పీఎఫ్ఏ సంస్థ అయినందున మిగతా జోన్లలో ఏర్పాటు చేసే పెంపుడు జంతువుల శ్మశానవాటిక నిర్వహణ చేసే స్వచ్ఛంద సంస్థలు కూడా యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొంది ఉండాలి. ఎల్బీనగర్ జోన్లో ఇప్పటికే ఫతుల్లాగూడలో ఏర్పాటు చేయగా.. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, చార్మినార్ జోన్‌లోని జంతు సంరక్షణ కేంద్రాల్లోనూ ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఫతుల్లాగూడతో పాటుగా చుడిబజార్, అంబర్‌పేట, మహదేవ్‌పూర, కేపీహెచ్‌బీ కాలనీల్లో ఏర్పాటు చేసిన అనిమల్ కేర్ సెంటర్లో పెంపుడు జంతువుల దహన వాటికలు ఏర్పాటు చేస్తారు. శేరిలింగంపల్లి జోన్ నల్లగండ్ల, చార్మినార్ జోన్లో కాటేదాన్‌లో నూతనంగా జంతు దహన వాటికల కేంద్రం నిర్మాణానికి స్థల సేకరణ పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ సూచనలతోపాటు జీహెచ్ఎంసీ రూల్స్ ప్రకారం పెంపుడు జంతువుల దహన వాటికలను ఏర్పాటు చేయనున్నారు. ఫతుల్లాగూడ పీపుల్స్ ఫర్ యానిమల్ స్వచ్ఛంద సహకారం చేయగా నూతనంగా ఏర్పాటు చేసే ఈ కేంద్రాలకు భస్మీకరణ చేసే యంత్రాలు, జీహెచ్ఎంసీ నిధులతో ఏర్పాటు చేస్తారు. వాటి నిర్వహణ మాత్రం స్వచ్ఛంద సంస్థలు చేస్తాయి. ఈ సంస్థలు జీహెచ్ఎంసీ నిర్ణయించిన ధరకే పెంపుడు జంతువులకు గౌరవ ప్రదంగా అంత్యక్రియులు జరుపుతారు. స్వచ్ఛంద సంస్థలు రికార్డు, ఎల్పీజీ గ్యాస్, భద్రపరిచేందుకు ఫ్రిడ్జ్‌లు అవసరమైన సిబ్బందికి వేతనాలు చెల్లింపు ఇతరత్రా ఖర్చులు మాత్రం స్వచ్ఛంద సంస్థ భరించాల్సి ఉంటుంది.