పీర్జాదిగూడ, సెప్టెంబర్17: వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… బోడుప్పల్ రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన ఎం.శ్రీనివాస్ (51) స్థానికంగా పూల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 1వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జవహర్‌నగర్, సెప్టెంబర్ 17: ఇంటి నుంచి బయటకు వెళ్లిన మతిస్థిమితం లేని విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం… హకీంపేటలోని ఎన్ఐఎస్ఏలో రజిత్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి కుమారుడు అమన్‌జిత్(7) ఓల్డ్ బోయిన్‌పల్లిలోని ఎన్ఐసీఐడీలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు. శనివారం సెలవు కావడంతో అమన్‌జిత్ బయట ఆడుకుంటున్నాడని తల్లిదండ్రులు భావించారు. తిరిగి ఇంటికి రాలేదు. దీంతో చుట్టు పక్కల ఆచూకీ కోసం వెతికినా లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 89036 57133 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
శామీర్‌పేట, సెప్టెంబర్ 17 : ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కండ్లకోయ సీఎంఆర్ కళాశాల సమీపంలో నివాసం ఉండే పబిన్నాథ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఈ నెల 13వ తేదీన డ్యూటీకి వెళ్తున్నానని భార్య సంగీతకు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడు. రాత్రి తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.