అబిడ్స్, డిసెంబర్ 10: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మంగళ్‌హాట్ పోలీసులు అరెస్ట్ చేసి.. పెద్ద మొత్తంలో సరుకును స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ చక్రవర్తి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. పలు కేసులతో సంబంధం ఉన్న ధూల్‌పేట్‌కు చెందిన ఆకాశ్‌సింగ్ షేక్ సుభాని నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని అమ్మకాలు ప్రారంభించాడు.
కాగా, వాహనంలో 72 కిలోల గంజాయితో పాటు 1.8 కిలోల గంజాయి విత్తనాలను ఆకాశ్‌సింగ్ వాహనంలో తరలిస్తుండగా విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, మంగళ్‌హాట్ పోలీసులు పురానాపూల్ ప్రాంతంలో పట్టుకున్నారు. ఆకాశ్‌సింగ్, రాంజల్ నర్సింహ, నీరజ్ ప్రసాద్ తివారి, షేక్ సుభాని లను అరెస్ట్ చేసి మొత్తం 25 లక్షల రూపాయల విలువ చేసే గంజాయి, వాహనాలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.