Nandi Nagar | బంజారాహిల్స్, డిసెంబర్ 21 : హైదరాబాద్ నడిబొడ్డున బంజారాల ఆత్మగౌరవాన్ని ప్రతీకగా చెప్పుకునే నందినగర్ మైదానం ఏడాది కాంగ్రెస్ పాలనలో కనిపించకుండా పోయింది. వేలాదిమంది ప్రయాణిలకు అడ్డాగా ఏడాది కిందట ఉన్న నందినగర్ గడ్డ నేడు ఆక్రమణలకు అడ్డాగా మారింది. అధికార పార్టీ నేతల ధనదాహానికి నందినగర్ మైదానం మొత్తం ఇరుకుగా మారడంతో కనీసం ఆర్టీసీ బస్సులు సైతం నిలిపివేశారు. సుమారు ఎకరన్నర స్థలంలో అత్యధిక భాగంలో తాత్కాలిక షెడ్లు, డబ్బాలు, బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని కొంతమంది అధికార పార్టీ నేతలు అద్దెలు వసూలు చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూశాఖ అధికారులు కానీ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ నోరుమెదపకపోవడం గమనార్హం. సుమారు రూ.150 కోట్ల విలువైన స్థలంలో ఆక్రమణలు జరుగుతున్నా.. పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడాదికాలంలో ఎకరం స్థలం కబ్జా..
షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్. 403లోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని నందినగర్‌లో సుమారు రెండు ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలానికి ఒక వైపున ఆంజనేయస్వామి ఆలయం ఉండగా, మిగిలిన స్థలం మొత్తం నందినగర్ గ్రౌండ్స్‌గా పిలుస్తుంటారు. ఏడాది కిందటి వరకు ఈ ఖాళీ ప్రభుత్వ స్థలంలో భారీ బహిరంగ సభలు కూడా జరిగేవి. నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు నందినగర్‌కు వచ్చి వేలాదిమంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేవి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కూతవేటు దూరంలో ఉండే నందినగర్ గ్రౌండ్స్‌లో పదేండ్ల కిందట సీసీ రోడ్డు వేయడంతో పాటు రోడ్డుకు రెండు వైపులా ఖాళీ స్థలాన్ని బస్స్టాప్గా వినియోగించేవారు. అయితే ఏడాది కిందట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్రమణలు ప్రారంభమయ్యాయి.
రోడ్డుకు రెండు వైపులా ఇష్టారాజ్యంగా హోటళ్లు, డబ్బాలు, ఇసుక వ్యాపారులు తిష్టవేశారు. దీంతో పాటు టీ స్టాళ్లు, కూరగాయలు, పండ్ల వ్యాపారులు ఆక్రమణలకు తెగబడ్డారు. దీనికి తోడు ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటున్న కొంతమంది భూ కబ్జాదారులు తాత్కాలిక షెడ్లను వేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. ఇలాంటి వారి వద్ద నుంచి కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా అద్దెలు వసూలు చేసుకుంటూ.. ఆక్రమణలను ప్రోత్సహిస్తుండడంతో రోజురోజుకూ నందినగర్ గ్రౌండ్స్ కాస్తా ఇరుకు సందుగా మారిపోయింది.
నందినగర్ గ్రౌండ్స్‌లో ప్రస్తుతం సుమారు 30 దాకా ఆక్రమణలు ఉన్నాయని, వీటితో పాటు కొన్ని తాత్కాలిక షెడ్లతో సుమారు 2000 గజాల స్థలం కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నందినగర్ గ్రౌండ్స్‌లో బస్సును రివర్స్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోవడంతో ఆరు నెలలుగా ఇక్కడకు వచ్చే 47 ఎన్, 127 ఎన్ బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. దీంతో తామంతా ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోందని, ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా.. తమకు ప్రయోజనం లేకుండా పోతోందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులకు నిత్యం ఫిర్యాదులు వస్తున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఆక్రమణలను తొలగించడం లేదని, ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు తెలిపారు.
టౌన్ ప్లానింగ్ సహకారంతో తొలగిస్తాం..
– అనితారెడ్డి, తహసీల్దార్, షేక్‌పేట మండలం
నందినగర్ గ్రౌండ్ మొత్తం ప్రభుత్వ స్థలంగా రికార్డుల్లో ఉంది. ఇటీవల ల్యాండ్ బ్యాంక్ వివరాలను పరిశీలిస్తుండగా, ఇక్కడి స్థలం కూడా జాబితాలో ఉండడంతో పరిశీలించాం. ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం, హైడ్రా అధికారుల సహకారం తీసుకుంటాం. పోలీసు బందోబస్తు తీసుకుని ఆక్రమణల తొలగింపు చేపడతాం. ప్రైవేటు వ్యక్తులు స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.