సిటీబ్యూరో, నవంబరు13(నమస్తే తెలంగాణ): పారిశుధ్య నిర్వహణలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. తాజాగా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ దేశ వ్యాప్తంగా శానిటేషన్ చాలెంజ్స్ పేరిట పోటీలను నిర్వహించడంతో అందులో హైదరాబాద్ మహానగరం గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ 2021అవార్డును గెలుచుకుంది. ప్రజల్లో పారిశుధ్యం పట్ల చైతన్యం తీసుకురావడంలో ముందంజలో ఉన్నదని హైదరాబాద్‌ను గుర్తించారు. దేశంలో అన్ని నగరాలను చెత్త రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వచ్ఛ భారత్-అర్బన్ పథకం రెండో దశను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దేశంలో పట్టణీకరణ విసురుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని కేంద్రం భావించి ఆ దిశగా చర్యలు చేపట్టింది. కేంద్రంగా ఆశించినట్లుగానే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణలో పలు సంస్కరణలు తీసుకువచ్చి, సమర్థవంతంగా అమలు చేసింది.
వ్యర్థాల సేకరణ పెరుగుతున్నది ఇలా..
స్వచ్ఛ ఆటో టిప్పర్లు రాకతో 2016 సంవత్సరంలో 3500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉండగా 2017 నాటికి 4500 మెట్రిక్ టన్నులకు చేరుకున్నది. గతేడాది 5, 600 మెట్రిక్ టన్నుల చెత్త, ఈ ఏడాదిలో 6వేల మెట్రిక్ టన్నులు ఉంది. పండగల సమయంలో మరో 1500 మెట్రిక్ టన్ను మేర అదనంగా చెత్తను సేకరిస్తున్నారు. డ్రైవర్ కం ఓనర్ పథకం ద్వారా సుమారు 5 వేల మందికి పైగా జీవనోపాధి కల్పించారు. ఒక ఆటోకు డ్రైవర్‌తో పాటు హెల్పర్ ఉంటారు. వీరంతా సకాలంలో ఇంటి ముందుకు వెళ్లి ఆటో ద్వారా చెత్తను సేకరిస్తారు. ఇటీవల వచ్చిన 650 స్వచ్ఛ టిప్పర్లను 30 సర్కిళ్లకు కేటాయించారు. ఈ ఆటోను పొందిన వారు ఆయా ప్రాంతంలో 600 ఇండ్లను వెళ్లి చెత్తను సేకరిస్తున్నారు.
చెత్త తరలింపునకు ఆధునిక వాహనాలు
నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫర్ స్టేషన్ల స్థానంలో ఆధునిక పద్ధ్దతిలో 60 సెకండరీ కలెక్షన్, ట్రాన్స్‌పోర్టు పాయింట్లను(ఎస్‌సీటీపీ)లను ఏర్పాటుకు జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. ఈ కేంద్రాల నుంచి మున్సిపల్ వ్యర్థాలను తరలించేందుకు 35 జీవీడబ్ల్యూ సామర్థ్యం కలిగిన 55 బెంజ్ వాహనాలను, 61 పోర్టబుల్ సెల్ప్ కాంప్యాక్టర్లు, 16 హై కెపాసిటీ ఆటోమేటెడ్ స్టాటిక్ కంప్యాక్టర్లు, 65 హై కెపాసిటీ సిల్డ్ కంటెయినర్లను జీహెచ్ఎంసీ సమకూర్చుకుంది.
శానిటేషన్ వర్కర్లకు వేతనాల పెంపు
గ్రేటర్ పరిధిలోని శానిటేషన్ వర్కర్ల వేతనాలను రూ.14500ల నుంచి రూ.17,500లకు పెంచారు. దీంతో 18550 మంది శానిటేషన్ వర్కర్లు, 948ఎస్ఎఫ్ఏలు, ఎంటమాలజీ వర్కర్లకు లబ్ధి చేకూరింది.
లక్ష్యం దిశగా పటిష్టమైన చర్యలు..
చెత్త డబ్బా రహిత నగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా ఆపేందుకు గానూ జీహెచ్ఎంసీ 900 చెత్త వ్యర్థాల డబ్బాలను తొలగించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకుగానూ ఇంటికీ రెండు డబ్బాలను పంపిణీ చేశారు. ఇంటింటి చెత్త సేకరణకు 3150 స్వచ్ఛ టిప్పర్లను తీసుకొచ్చి చెత్త సేకరణ, తరలింపులో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే గతంలో నిత్యం 5500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సేకరిస్తుండగా, ప్రస్తుతం ప్రతి రోజూ 6వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమ నిబంధనల ప్రకారం చెత్త సేకరణ, వ్యర్థాల తరలింపు ప్రక్రియ జరుగుతుంది. కొత్తగా మరో 1350 స్వచ్ఛ ఆటో టిప్పర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో శానిటేషన్ కోసం రూ.550 కోట్ల బడ్జెట్ కేటాయించి వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపడుతున్నారు.