Hyderabad Metro | సిటీబ్యూరో: నగరంలో మొదటి దశ మెట్రోను పూర్తిగా పీపీపీ విధానంలో నిర్మిస్తే, రెండో దశను పూర్తిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే నిధులను సమకూరాల్చిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలుగా మార్చిన తర్వాత రెండోదశ మెట్రో రైలు మార్గాల ప్రతిపాదనలకు సంబంధించిన డీపీఆర్‌లను ఎట్టకేలకు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి, కేంద్రానికి పంపితే అక్కడ ఆమోదం ముద్ర పొందడమే తరువాయి అన్నట్లుగా ఉంది.
అయితే రెండో దశలో నిర్మించాలని నిర్ణయించిన 76.2 కి.మీ మార్గానికి సుమారు రూ.24237 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రెండో దశలో ప్రతిపాదించిన 5 మెట్రో మార్గాలను ముందుగా నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో నిధులు ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై హైదరాబాద్ మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటి వరకు నిర్ణయించిన ప్రకారం రెండో దశ మెట్రో ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం 15శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం భరిస్తే, మిగతా 50 శాతంలో 45 శాతం రుణాల ద్వారా, మరో 5 శాతం వ్యయాన్ని పీపీపీ విధానంలో సమకూర్చుకునేలా రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతులు రావడం ఒక్క ఎత్తయితే…. దానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపు ఎప్పటి వరకు ఇస్తారో చెప్పలేని పరిస్థితి.
ఇప్పటికే రెండో దశను 2029 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నా బడ్జెట్ కేటాయింపులే అత్యంత కీలకంగా మారనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు గడుస్తున్నా, మెట్రో ప్రాజెక్టు పరంగా పెద్దగా పురోగతి లేదు. 7-8 నెలలుగా కొత్త రూట్లు,వాటికి అనుగుణంగా డీపీఆర్‌లను రూపొందించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇక ప్రస్తుతం రెండో దశ మెట్రో పరుగులు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే చొరవ మీద ఆధారపడి ఉంటుందని మెట్రో అధికారి ఒకరు చెప్పారు.
రెండో దశ మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు డీపీఆర్‌లో పొందుపర్చిన అంచనా ప్రకారం రూ.24237 కోట్ల వ్యయం అవుతుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 35 శాతం భరించాలంటే సుమారు రూ.9210 కోట్లను నేరుగా వెచ్చించాల్సి ఉండగా, కేంద్రం 15 శాతం వాటాగా 3635 కోట్లను రెండో దశ మెట్రో కోసం కేటాయించాల్సి ఉంటుంది.
ఇక మిగిలిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీర్‌గా ఉండి దేశ, విదేశీ బ్యాంకుల ద్వారా నిధులను సకాలంలో ఇప్పించగలిగితేనే మెట్రో ప్రాజెక్టు పనులు మొదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కొర్రీ పెట్టినా ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండే పరిస్థితి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, నిధుల పరంగా సహకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో మెట్రో కోసం నిధులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.