సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఆవర్తనం ప్రభావం కారణంగా నగరంలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది.
సికింద్రాబాద్ దాని పరసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23.4 గాలిలో తేమ 73 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.