Manikonda | మణికొండ, ఏప్రిల్ 12: గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరాలో జలమండలి అధికారులు తాత్సారం చూపుతున్నారంటూ మణికొండ మున్సిపాలిటీ శివాజీ నగర్ కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మణికొండ జలమండలి అధికారులకు కాలనీవాసులు మూకుమ్మడిగా కార్యాలయానికి చేరుకుని తమకు సక్రమంగా నీటి సరఫరా చేయాలంటూ వినతి పత్రం అందజేశారు.
ప్రతిరోజూ అరగంటకు తక్కువగానే నీటిని సరఫరా చేస్తున్నారని, అందులోనూ కలుషిత నీరే ఎక్కువగా వస్తుందని మణికొండ శివాజీ నగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై చాలా రోజులుగా మణికొండ జలమండలి అధికారులకు విన్నవించిన ఎలాంటి స్పందన లేదని వాపోయారు. తక్షణమే తమ కాలనీకి తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. కొత్త పైపులైన్ వేస్తామని నాలుగు నెలల క్రితం అధికారులు తెలిపారని.. ఇప్పటికీ ఎలాంటి పనులు మొదలు పెట్టలేదని అన్నారు. ఓవైపు వేసవి ఎండలు మండుతుంటే మరోవైపు తాగునీటి సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. జలమండలి అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి శివాజీ నగర్ కాలనీవాసుల దాహార్తి తీర్చాలని కోరారు.