Hyderabad | వెంగళరావునగర్, జూన్ 11 : అమ్మాయి స్నేహం చేసిందని ఆమెను తప్పుడు ఉద్దేశంతో చూశాడో కామాంధుడు. తన కోరికను తీర్చాలని ఆమె వెంటపడ్డాడు. అందుకు నిరాకరించడంతో ఆమె ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించాడు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన యువతి (22)కి మూసాపేటకు చెందిన బి.హేమంత్‌కుమార్ (24)తో కొంతకాలం కిందట పరిచయమైంది. ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. అయితే ఈ స్నేహాన్ని ఆసరాగా తీసుకుని తన కోరికలు తీర్చాలని యువతిని వేధించాడు. దీంతో సదరు యువతి అతన్ని దూరం పెట్టింది. అయినప్పటికీ హేమంత్ ఆమెను వెంబడించాడు. ఆమె ఎక్కడికి వెళ్లినా సరే ఆమె దగ్గరకు వెళ్లి వేధించాడు. అలాగే ఫోన్‌కు అసభ్యకరంగా మెసేజ్‌లు పంపించేవాడు. అంతటితో ఆగకుండా తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, సోషల్‌మీడియాలో పెడతానని బెదిరించాడు.
హేమంత్ వేధింపులతో విసిగిపోయిన సదరు యువతి తాజాగా మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. హేమంత్ వేధింపులను మొత్తం వారికి వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.