హైదరాబాద్: అమెరికాలో (America) హైదరాబాద్‌కు చెందిన మరో వృక్తి మృతిచెందారు. మూడు రోజుల క్రితం డల్లాస్‌లో దుండగుడి కాల్పుల్లో మీర్‌పేట వాసి పోలే చంద్రశేఖర్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా చికాగోలో (Chicago) జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) చంచల్‌గూడకు చెందిన షెరాజ్ మెహతాబ్ మొహమ్మద్ (25) చనిపోయారు. ఆదివారం ఇల్లినాయిస్ ఈవెన్‌స్టన్ వద్ద జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తున్నది. విషయం తెలసుకున్న అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ఉన్నత అవకాశాల కోసం తమ కుమారుడు అమెరికాకు వెళ్లి చనిపోయాడంటూ షెరాజ్ తండ్రి అల్తాఫ్ మొహమ్మద్ కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. చంద్రశేఖర్ చనిపోయాడన్న వార్త తెలిసి 48 గంటలు గడువకముందే అమెరికాలో మరో హైదరాబాదీ మృతిచెందడం గమనార్హం.
కోటి ఆశలతో ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి విగతజీవిగా మారాడు. తమ కుటుంబంలో వెలుగు నింపుతాడనుకున్న కుమారుడి మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. హైదరాబాద్‌లో బీడీఎస్ చదివి ఎండీఎస్ చదివేందుకు అమెరికా వెళ్లిన మీర్‌పేట వాసి పోలే చంద్రశేఖర్(27) డాలస్‌లో దుండగుడి కాల్పుల్లో మరణించాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మీర్‌పేట టీచర్స్ కాలనీకి చెందిన జగన్మోహన్, సునీత దంపతులకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు చంద్రశేఖర్ హైదరాబాద్‌లో బీడీఎస్ చదివాడు. ఎండీఎస్ చదివేందుకు 2023లో అమెరికా వెళ్లాడు.
ఆరు నెలల క్రితమే కోర్సు పూర్తి చేశాడు. ఫుల్‌టైమ్ జాబ్ కోసం వెతుక్కుంటూనే డాలస్‌లోని గ్యాస్ ఫిలింగ్ స్టేషన్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి విధుల్లో ఉన్న సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి(నల్లజాతీయుడు) అకస్మాత్తుగా వచ్చి, కాల్పులు జరిపినట్టు తెలిసిందని చంద్రశేఖర్ తల్లిదండ్రులు చెప్తున్నారు. దీంతో తమ కుమారుడు అక్కడికక్కడే మృతి చెందాడని యూఎస్ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఘటనపై అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసి, దర్యాప్తు వేగవంతం చేయాలని కోరినట్టు చెప్పారు.
అమెరికాలో ఉన్నత చదువులు చదువుకునేందుకు వెళ్లిన చంద్రశేఖర్ హత్యకు గురికావడంతో మీర్‌పేట టీచర్స్ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు, స్నేహితులు వచ్చి, చంద్రశేఖర్ తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. పెద్ద చదువులు చదువుకొని గొప్పగా తిరిగి వస్తాడనుకున్న తమ కుమారుడు విగతజీవిగా వస్తున్నాడంటూ చంద్రశేఖర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడి భౌతికకాయాన్ని త్వరగా స్వదేశానికి తరలించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. జాత్యాహంకారంతోనే చంద్రశేఖర్ హత్య జరిగి ఉంటుందని అతడి స్నేహితులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.