జియాగూడ, ఏప్రిల్ 29 : అధికారుల నిర్లక్ష్యం కారణంగా జియాగూడ బైపాస్ అనుకున్న స్థాయిలో ప్రజలకు ఉపయోగపడటం లేదు. రెండేళ్ల నుంచి అభివృద్ధి పనులు కొనసాగుతున్నా ఇంకా పూర్తి కాలేదు. ఒకవైపు నుంచే రోడ్డును వినియోగించుకోవాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జియాగూడ వంద ఫీట్ల బైపాస్ రోడ్డు పనులను సుమారు 26 కోట్ల వ్యయంతో చేపట్టారు. జియాగూడ మూసీని అనుకుని పురానాపూల్ నుంచి రాంసింగ్పురా వరకు ఈ రోడ్డు నిర్మించాల్సిఉంది. కానీ ఈ బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులు రెండేళ్లుగా పూర్తికాకపోవడంతో అనుకున్న స్థాయిలో ఇది ప్రజలకు ఉపయోగపడటం లేదు. ఈ రహదారిలో 100 ఫీట్ల బైపాస్ రోడ్డు మీదుగా 2.5 కిలోమీటర్ల పొడవున 1200 డయా సామర్థ్యం గల భారీ సీవరేజి పైప్లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రెండేండ్ల నుంచి పనులు జరుగుతున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు తవ్విన చోట వీడీసీసీ రోడ్డు నిర్మాణానికి జీహెచ్ఎంసీకి సుమారు రూ.6.5 కోట్ల నిధులు చెల్లించామని అధికారులు వెల్లడించారు. అయితే పైప్లైన్ పనులు నిర్మాణ పనులు పూర్తయిన రహదారిలో ఒకవైపు రోడ్డు మొత్తం నిరుపయోగంగా ఉండటంతో నిత్యం కబేలా మేకల మండికి వచ్చే భారీ వాహనాలు పార్కింగ్ కోసం ఉండటంతో కేవలం ఒకవైపు నుంచే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
ముఖ్యంగా ఈ రహదారిలో జియాగూడ మేకల మండి, డంపింగ్ యార్డ్ వల్ల కూడా ప్రయాణికులు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ రహదారిలో చెత్త డంపింగ్ యార్డుకు వచ్చే ట్రక్కుల వల్ల గంటల తరబడి వాహనాలు నిలచే ఉంటున్నాయి. అలాగే మేకల మండికి వచ్చే భారీ వాహనాల లోడ్ కూడా రోడ్డు పైనే నిలిపివేస్తున్నారు. దీంతో కూడా సమస్యలు తలెత్తున్నాయి. దీనికితోడు రాత్రి వేళలో గుర్తుతెలియని వ్యక్తులు డిపార్ట్మెంట్ వ్యర్థాలను తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేస్తున్నారు. దీనిపై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందో రహదారిలో ప్రయాణిస్తే కళ్లకు కనపడుతుందని మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.