Road Accident | మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. హైదరాబాద్‌కు చెందిన పలువురు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. గాయాలతో చికిత్స పొందుతున్న నవీన్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
మృతులు శశికాంత్, మల్లారెడ్డి
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నాచారం రాఘవేంద్ర నగర్ కార్తికేయనగర్‌కు చెందిన పలువురు మహాకుంభమేళాకు ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో మంగళవారం ఉదయం జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద 30వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనం సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో వాహనంలో దాదాపు 14 మంది వరకు ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రమాదంలో నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డి మృతి చెందినట్లు సమాచారం.
మల్లారెడ్డి నాచారం కార్తికేయ నగర్ కాలనీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన పాల వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. దాంతో ఆయనను పాల మల్లారెడ్డిగా పిలుస్తుంటారు. ప్రమాదంలో నేపథ్యంలో మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. కుంభమేళాకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలతో రంగారెడ్డి కలెక్టర్ మాట్లాడారు.