శేరిలింగంపల్లి, జూలై 18: గోపన్‌పల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసుకున్నా.. ప్రారంభించకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌తో సర్కారులో చలనం వచ్చింది. తమ ప్రభుత్వం నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించడం లేదని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలోని ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ..ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, నల్లగండ్ల, తెల్లాపూర్, చందానగర్ వాసులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కేటీఆర్ ట్వీట్‌తో అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
వెంటనే ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో గోపన్‌పల్లి తండాలో యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న ఫ్లైఓవర్ తుది దశ పనులను గురువారం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, శేరిలింగంపల్లి సర్కిల్ ఉపకమిషనర్ రజనీకాంత్‌రెడ్డి పరిశీలించారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
రూ. 28.5 కోట్ల వ్యయంతో..
బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గోపన్‌పల్లి తండా జంక్షన్లో వై ఆకారంలో రూ: 28.5 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా ఈ ైఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ కారిడార్ వైపు నుంచి నలగండ్ల, చందానగర్ వైపు 430 మీటర్ల పొడవు, తెల్లాపూర్ వైపు 550 మీటర్ల పొడవుతో వై ఆకారంలో వన్‌వేగా దీనిని నిర్మించారు. ముఖ్యంగా ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే.. ఐటీ కారిడార్ నుంచి నల్లగండ్ల, తెల్లాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్ ప్రాంతాల వారికి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి.