వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీగా ఇటీవలే అవార్డు అందుకున్న హైదరాబాద్ మహానగరం వర్టికల్ గార్డెన్‌లోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఢిల్లీ, బెంగళూరు నగరాల కంటే అత్యధికంగా 105 పిల్లర్లకు వర్టికల్ గార్డెన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో నగరంలోని ఫ్లైఓవర్లు పచ్చని పందిళ్లను తలపిస్తున్నాయి. నిలువెత్తు పచ్చదనంతో నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో కాలుష్యాన్ని నియంత్రిస్తూ, ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్శిటీ విభాగం చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఫ్లైఓవర్ల పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్ (నిలువుగా మొక్కల పెంపకం) చేపడుతున్నారు. ఫలితంగా ఫ్లై ఓవర్ల వెంబడి వెళ్లే వాహనదారులు, పాదాచారులకు చక్కటి ఆహ్లాదాన్ని పంచుతున్నారు.
సిటీబ్యూరో, అక్టోబరు 30 (నమస్తే తెలంగాణ): వర్టికల్ గార్డెన్‌లోనూ భాగ్య నగరం ఆదర్శంగా నిలుస్తున్నది. ఢిల్లీ, బెంగళూరు నగరాల కంటే 105 పిల్లర్లకు అదనంగా వర్టికల్ గార్డెన్‌ను ఏర్పాటు చేసింది. సాధారణంగా వర్టికల్ గార్డెన్లకు ఒకప్పుడు ఢిల్లీ, బెంగళూరు పెట్టింది పేరు. అయితే హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ప్రత్యేక థీమ్‌లతో ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్లు నగర వాసులను ఆకట్టుకోవడమే కాకుండా ఇతర మెట్రో నగరాల్లో కూడా ఇదే తరహా మోడల్ అమలుకు ఆసక్తి కనబరుస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే లివింగ్ గ్రీన్ కేటగిరి కింద హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో అందజేశారు. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క సిటీ హైదరాబాద్ కావడం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లు పచ్చని అందాలతో కనువిందు చేస్తున్నాయి. కాలుష్యాన్ని నియంత్రించడం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఫ్లై ఓవర్ల పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్ (నిలువుగా మొక్కల పెంపకం) చేపడుతున్నారు. ప్రతి వర్టికల్ గార్డెన్ ఆటోమేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ఏర్పాటు చేయడం, రోజుకు 100 మిల్లీ లీటర్ల డోస్‌తో నీరు అందించి ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణంలో ప్రయా ణం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లర్లకు అలంకారప్రాయమైన గ్రీన్ వాల్స్ మొక్కలను నాటుతున్నారు. ఫ్లై ఓవర్ల వెంబడి వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఆహ్లాదాన్ని పంచడమే లక్ష్యంగా వర్టికల్ గార్డెన్ చేపడుతున్నారు.
కనువిందు చేస్తున్న ఫ్లై ఓవర్లు ఇవే …!!
బేగంపేట, పంజాగుట్ట, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ -45, మాసబ్‌ట్యాంక్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్ (ఐ లవ్ హైదరాబాద్), షేక్‌పేట, బయో డైవర్సిటీ, ఏపీజె అబ్దుల్ కలాం ఆజాద్ ఫ్లై ఓవర్, సికింద్రాబాద్, నల్గొండ క్రాస్‌రోడ్, బాలానగర్, నాగోల్ మూసీ బ్రిడ్జి తదితర ఫ్లై ఓవర్లలోని 105 పిల్లర్లకు ఆయా స్థానిక థీమ్‌లతో వర్టికల్ గార్డెన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు నాగోల్, కోరంటి, చిక్కడపల్లి, ఖైరతాబాద్ బ్రిడ్జిలకు గ్రీనరీ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మరో మూడు ఫ్లై ఓవర్లకు పనులు: అధికారులు
గ్రేటర్ పరిధిలో పచ్చదనం పెంపొందించేందుకు ఫ్లైఓవర్ పిల్లర్స్‌కు నిలువు ఆకారం(వర్టికల్)లో మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటి వరకు దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువ సంఖ్యలో వర్టికల్ గార్డెన్స్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 105 ఉన్నాయి… కొత్తగా శిల్పా లే అవుట్, కొండాపూర్, నాగోల్ ఫ్లై ఓవర్ల పరిధిలో మరిన్ని ఏర్పాటు చేస్తున్నారు. మునుముందు నగరంలో అన్ని కలిపి 150 చోట్ల వర్టికల్ గార్డెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు వర్టికల్ గార్డెన్లకు సుమారు రూ. 3.5కోట్ల మేర ఖర్చు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.