సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరాయని, ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ తెలిపారు. పోలింగ్ కేంద్రాన్ని ప్రజలు గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకోవాలన్నారు. పోల్ క్యూ రూట్ యాప్ ద్వారా తమ పోలింగ్ కేంద్రంలో ఎందరు క్యూలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని వెళ్లి ఓటు హక్కును వినియోగంచుకునేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అభ్యర్థుల ర్యాలీలు, మైకులు, వాహనాల ద్వారా ప్రసంగాలు… తదితరవన్నీ నేటి (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ముగుస్తాయన్నారు.
ఈ నెల 29, 30వ తేదీల్లో అభ్యర్థులు పత్రికల్లో ప్రచార ప్రకటనలు చేసుకోవచ్చని, అయితే ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ నెల 29న ఉదయం 8 గంటల నుంచి ఈవీఎంలను డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 312 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 20 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ 95 శాతం పూర్తయిందని చెప్పారు.
1136 ఫిర్యాదులు..
ఎన్నికల నియామవళి ప్రవర్తనా ఉల్లంఘనపై సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 1136 ఫిర్యాదులు వచ్చాయని రొనాల్డ్‌రాస్ తెలిపారు. తమ వివరాలు తెలుపకుండా కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్..
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉండటంతో పాటు అన్ని కేంద్రాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థ ఉంటుందని రొనాల్డ్‌రాస్ పేర్కొన్నారు. సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లు, జిల్లా ఎన్నికల అధికారి, ఐసీసీసీ పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో స్క్రీన్ల ద్వారా పరిస్థితులు వీక్షించే సదుపాయం ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాల వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 369 రూట్లలో.. 369 సెక్టార్లలో సెక్టార్ ఆఫీసర్లు ఉంటారన్నారు.
733 మంది హోం ఓటింగ్ సద్వినియోగం
గడిచిన కొద్ది రోజులుగా హోం ఓటింగ్ ప్రక్రియ చేపట్టగా.. 838 దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు 733 మంది సద్వినియోగం చేసుకున్నట్లు రొనాల్డ్‌రాస్ తెలిపారు. 80 సంవత్సరాల పైబడిన 653 మంది, దివ్యాంగులు 80 మంది వరకు ఉన్నారని తెలిపారు. పోలీసుల విషయానికొస్తే గతంలో కంటే ఎక్కువ మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని, గతంలో 300 మంది ఉంటే.. ఈ సారి ఇప్పటికే 5 వేల మంది ఓటు వేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఓటింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ సారి బ్యాలెట్ల పంపిణీ కొత్త విధానం కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. అందరికీ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. బుధవారంలోగా అందరికీ ఓటు వేసే సదుపాయం కల్పిస్తామన్నారు.
ఎపిక్ కార్డు లేకుంటే 12 కార్డులు..
ఎపిక్ కార్డు లేని వారంతా 12 రకాల ఫొటో గుర్తింపు కార్డుల్ని చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ రొనాల్డ్‌రాస్ తెలిపారు. ఓటరు హెల్ప్‌లైన్ యాప్ ద్వారా, 1950 నంబర్ ఫోన్ ద్వారా పోలింగ్ కేంద్రం.. తదితర వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. రోజూ దాదాపు వెయ్యి ఫోన్లు వస్తున్నాయని, పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. పోలింగ్‌కు ముందు ఉదయాన్నే 5.45 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు.
రూ. 79.07 కోట్ల నగదు స్వాధీనం..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఇప్పటి వరకు రూ. 79.07 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ తెలిపారు.
హైదరాబాద్ జిల్లా ఓటర్ల వివరాలు..
– జిల్లా ఓటర్లు -45,36,852
– పురుషులు -2322623
– మహిళలు -2213902
– థర్డ్ జెండర్ -327
15 అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కలివి