Hyderabad | హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో అతను ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఎస్ఆర్నగర్లోని బాపునగర్‌కు చెందిన భూక్యా అశోక్(36) స్థానికంగా వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో.. రుక్సానా బేగం అనే మహిళను రెండో పెండ్లి చేసుకున్నాడు. మద్యానికి బానిసైన అశోక్.. తాగొచ్చి భార్యను వేధించేవాడు. చేయి కూడా చేసుకునేవాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకుంటానని అశోక్ బెదిరించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం 6 గంటలకే తాగడం మొదలుపెట్టాడు. అది చూసిన భార్య మందలించడంతో ఆమెను కొట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో చనిపోతానంటూ బెదిరించి ఇంట్లో నుంచి బయటకొచ్చేశాడు. ఆ తర్వాత ఫుల్లుగా తాగిన అశోక్ మధ్యాహ్నం 1:30 గంట ప్రాంతంలో బాలానగర్ ఫ్లైఓవర్ ఎక్కి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో అశోక్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అశోక్ మరణించాడు. కాగా, మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. మద్యం మత్తులో అశోక్ ఫ్లైఓవర్ పైనుంచి దూకడం అందులో రికార్డయ్యింది.