సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంతో ఉద్యోగార్థులు సాధన ముమ్మరం చేశారు. ఉదయాన్నే మైదానాల్లో దేహదారుఢ్య కసరత్తులు చేస్తూ.. ఆ వెంటనే గ్రంథాలయాలకు పరుగులు పెడుతున్నారు. నగరంలోని మైదానాలు, లైబ్రరీలు ఎప్పుడు చూసినా రద్దీగా ఉంటున్నాయి. యూనివర్సిటీ లైబ్రరీలతో పాటు చిక్కడపల్లి పరిధి అశోక్‌నగర్‌లోని సిటీ సెంట్రల్ లైబ్రరీ, చాదర్‌ఘాట్‌లోని స్టేట్ లైబ్రరీలకు ఉద్యోగార్థులు పోటెత్తుతున్నారు. ఉదయం 8 గంటలకు తెరుచుకునే గ్రంథాలయాలకు రెండు గంటల ముందే వచ్చి వేచి చూస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యమైనా లైబ్రరీల్లో సీట్లు దొరకని పరిస్థితి ఉంది. కొందరైతే రాత్రి 11 గంటల వరకు చదువుకుంటూ.. రెగ్యులర్‌గా కూర్చునే సీట్లలోనే వారికి చెందిన పుస్తకాలను పెట్టుకొని వెళుతున్నారు. నగరవ్యాప్తంగా ఉన్న లైబ్రరీల్లో ఇదే పరిస్థితి నెలకొందని గ్రంథపాలకులు పేర్కొంటున్నారు.
లైబ్రరీలకు పరుగులు
కొంచెం ఆలస్యమైనా గ్రంథాలయాల్లో సీట్లు దొరకడం లేదు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన లైబ్రరీ వద్ద అయితే రెండు గంటల ముందే గేటు వద్ద వేచి ఉంటున్నారు. ముఖ్యమంత్రి ఉద్యోగాల ప్రకటన చేసిన నాటి నుంచే చాలా మంది చదవడం మొదలు పెట్టారు. తాజా నోటిఫికేషన్లు రావడంతో లైబ్రరీలకు పరుగులు పెడుతున్నారు.
– సుధాకర్, తెలుగు యూనివర్సిటీ
నిమిషం లేటైనా సీట్లు దొరకవు
నిమిషం లేటైనా లైబ్రరీల్లో సీట్లు దొరకవు. అందుకే గంట ముందే వచ్చి వేచి ఉంటున్నాను. ఎస్సై ఉద్యోగం సాధించాలంటే కూర్చొని చదవాల్సిందే. పోలీస్ విభాగంలో విపరీతమైన పోటీ ఉంటుంది. పోటీలో నిలవాలంటే.. ముందే గ్రంథాలయానికి రావాలి. అందరికంటే మంచి మార్కులతో ఉద్యోగం సాధించాలనేదే ధ్యేయం.
– నవనీత, చిక్కడపల్లి లైబ్రరీ
పోటీపడి చదువాల్సిందే..
గతంలో రెండు మార్కులతో ఉద్యోగం మిస్ అయింది. ఈ సారి ఎస్సై ఉద్యోగం కోసం పట్టుదలతో చదువుతున్నాం. పోటీ పడి చదవాలనే లైబ్రరీకి వస్తాం. నోటిఫికేషన్ వచ్చింది కనుక నిరంతరం చదువుతూనే ఉండాలి. సీట్లోనే తింటున్నాం.. నిద్రొస్తే కాసేపు అందులోనే విశ్రాంతి తీసుకుంటున్నాం. – శషాంక్ మోహన్, సికింద్రాబాద్ లైబ్రరీ