సికింద్రాబాద్, ఏప్రిల్ 28 : ఆర్మీ ఆర్డినెన్స్ సర్కిల్(ఏఓసీ) రోడ్లకు ప్రత్యామ్నాయ రహదారులు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. 41 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు లోకల్ మిలిటరీ అథారిటీ (ఎల్ఎంఏ) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా, భూ బదలాయింపు కింద 34 ఎకరాలు, లీజు పద్ధతిలో 7 ఎకరాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ లేఖ రాసింది. లీజు పద్ధతిలో ఆర్కేపురం వద్ద ఇచ్చే భూమికి ఏటా ఎకరానికి రూ.30 వేల చొప్పున ఇవ్వాలని తెలిపింది. అదీకాకుండా, రక్షణ శాఖ భూముల్లో ఉన్న వాటర్ పైప్‌లైన్, డ్రైనేజీ లైన్, విద్యుత్తు నెట్వర్క్ వంటి వ్యవస్థలు దెబ్బతినే అవకాశాలు ఉండటంతో తగిన నష్ట పరిహారాన్ని రాష్ట్ర సర్కారు ఇవ్వాలని రక్షణ శాఖ మెలిక పెట్టనున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై జీహెచ్ఎంసీ, ఎల్ఎంఏ అధికారులు సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. చర్చలు సఫలమైతే వాహనదారుల ఇక్కట్లు తొలగిపోతాయి. ఈస్ట్ మారేడ్‌పల్లి నుంచి ఆర్కేపురం వరకు రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. కాగా, గతంలో రోడ్లకు సంబంధించి మరో ప్రాంతంలో అంతే విలువైన భూమి లేదా నిబంధనల ప్రకారం పరిహారం ఇవ్వాలని ఎల్ఎంఏ అడగ్గా, కేవలం భూములిస్తే తమ ఖర్చులతో రోడ్డు నిర్మించుకుంటామని జీహెచ్ఎంసీ పేర్కొన్నది. దీనిపై అప్పట్లో పలుమార్లు చర్చలు జరిగినా సయోధ్య కుదరలేదు. ఇటీవల మంత్రి కేటీఆర్, ఆర్మీ ఉన్నతాధికారులు భేటీ అయ్యి ప్రత్యామ్నాయ రోడ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే 41 ఎకరాలు ఇచ్చేందుకు రక్షణ శాఖ ముందుకు వచ్చింది.
రెండేండ్ల కిందటే జీహెచ్ఎంసీ ప్రణాళిక
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వెల్లింగ్టన్, గఫ్ రోడ్డు, ఎంట్రెన్స్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్లు ప్రధానమైనవి. ఈ మార్గాల ద్వారా సికింద్రాబాద్ వైపు నుంచి నేరేడ్మెట్, మల్కాజిగిరి, సైనిక్‌పురి, ఈసీఐఎల్, ఆర్కే పురం తదితర ప్రాంతాల వైపు లక్షలాది మంది వాహనదారులు రాకపోకలు సాగిస్తారు. ఈ మధ్య ఈ రోడ్లను ఎక్కువ సందర్భాల్లో మూసివేస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్య వస్తుందని ముందే గుర్తించిన జీహెచ్ఎంసీ.. రెండేండ్ల కిందటే ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. మారేడ్‌పల్లిలోని సికింద్రాబాద్ క్లబ్ వెనుక వైపు నుంచి ఆర్మీ భూముల గుండా ఆర్కే పురం, సైనిక్‌పురి వైపు 6 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది.