చార్మినార్, ఏప్రిల్ 28 : లక్ష్యసాధనలో విశ్రమించొద్దని, ప్రభుత్వ ఉద్యోగ సాధనే అంతిమ లక్ష్యంగా తమ సాధన కొనసాగించాలని ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ కమిషనర్ యోగితారాణా సూచించారు. గురువారం పేట్లబురుజు సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఎస్సీ యువతీయువకుల ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ యోగితారాణా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, దశల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయనుందన్నారు. పోలీసుశాఖలో ఎస్సై, కానిస్టేబుళ్లతోపాటు గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చాయని, ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఉద్యోగ సాధనే లక్ష్యంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్సీ అభ్యర్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని, రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో కేంద్రంలో 100 మంది చొప్పున 3,300 మందికి రెండునెలలపాటు శిక్షణ ఇస్తామని, ఇందుకోసం రూ.4.35 కోట్లు, గ్రూప్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సుల బోధనకు రూ.2.98 కోట్లు, సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతున్న 150 మందికి రూ.1.92 కోట్లతో శిక్షణ కల్పించనున్నామని వెల్లడించారు. ఎస్సీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుమారు 7వేల మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగంలో స్థిరపడేలా తర్ఫీదు ఇస్తామన్నారు. సిటీ పోలీస్ హెడ్‌క్వార్టర్ జాయింట్ కమిషనర్ కార్తికేయ, సీటీసీ ప్రిన్సిపాల్, అదనపు కమిషనర్ మద్దిలేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంఏ బాఖ్రీ తదితరులు పాల్గొన్నారు.