బడంగ్‌పేట, ఏప్రిల్28 : ప్రతి కాలనీకి మంచి నీటి పైపులైన్లు వేయించాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన సూచనల మేరకు పైపులైన్ పనులు వేగ వంతం చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6,7,8,9 డివిజన్లలో రూ. 2.77 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, మంచి నీటి పైపులైన్ పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికీ మంచి నీరు అందివ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి కాలనీకి మంచి నీటి సరఫరా చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. పనులను వేగ వంతంగా పూర్తి చేయాలని ఆమె అధికారులకు తెలిపారు.
దశల వారీగా నోటిఫికేషన్లు..
రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి 80వేల ఉద్యోగాలకు ప్రకటన చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని చె ప్పారు. దశలవారీగా 80వేల పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. పేద విద్యార్థులు డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోలేని వారి కోస ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. మహేశ్వరం, కందుకూరు విద్యార్థుల కోసం తుక్కుగూడలో ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న విద్యార్థుల కోసం ఉచిత కోచింత్ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఉచిత శిక్షణ తీసుకోవాలనుకున్న వారు మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. మేయర్లు, కార్పొరేటర్లు బాధ్యత తీసుకొని కోచింగ్ తీసుకునే వారి జాబితాను తయారు చేయాలని అన్నారు. వారం రోజులలోపు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణమోహన్‌రెడ్డి, డీఈఈ అశోక్‌రెడ్డి, కార్పొరేటర్లు ఇంద్రసేనా, నిమ్మల సునీతాశ్రీకాంత్‌గౌడ్, శ్రీధర్‌రెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, శంకర్, సూర్ణగంటి అర్జున్, కోఆప్షన్ సభ్యులు సమాఖ్య జ్యోతి అశోక్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, కాలనీ వాసులు ఉన్నారు.