ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 28:ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని అన్ని డిపార్ట్మెంట్లలో ప్రతి ఏటా నిర్వహించే సింపోజియంలకు సర్వం సిద్ధమైంది. వివిధ విభాగాలలో వేర్వేరు పేర్లతో జరిపే ఈ సింపోజియంల నిర్వహణా బాధ్యతలను పూర్తిగా ఆయా డిపార్ట్మెంట్లలో ఉండే మూడో సంవత్సరం విద్యార్థులు నిర్వర్తిస్తారు.ఈ సింపోజియంల్లో భాగంగా పలు విభాగాలలో పోటీలు నిర్వహిస్తారు. వివిధ అంశాలపై నిపుణులతో ఉపన్యాస కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు కళాశాలల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి విద్యార్థులు
ప్రతి ఏటా పెద్ద ఎత్తున పాల్గొంటారు.దాంతో యూనివర్సిటీ సందడిగా మారుతుంది.
ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ..
ఓయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు సాంస్కృతికపరమైన పోటీలను ‘అల్గోరిథమ్’ పేరుతో గతంలో నిర్వహించేవారు. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విజ్ఞానాన్ని అందించాలనే ఆలోచనతో 2002 నుంచి టెక్నికల్ సింపోజియంలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ సింపోజియంలు ఉపయోగపడేలా వాటిని రూపొందించారు. ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సింపోజియంలను నిర్వహిస్తారు.
పలు మోడళ్లు ప్రదర్శన
సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్మాణ్ పేరుతో సింపోజియం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తారు. విద్యార్థులు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా పలు నమూనాలను ప్రదర్శిస్తారు. ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఆకృతి పేరుతో సింపోజియం ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అన్ని శాస్త్ర సాంకేతిక పరికరాల పురాతన మోడళ్లతో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు ఇన్ఫినిటీ పేరుతో, ఎలక్ట్రికల్ విభాగంలో టెక్సోనెన్స్, బయోమెడికల్ విభాగంలో మెడిటెక్ పేరుతో సింపోజియంలు నిర్వహించనున్నారు.
మెకానికల్ విద్యార్థుల మెకరీనా
మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు మెకరీనా పేరుతో సింపోజియం నిర్వహిస్తారు. థండర్బోట్, రోబోటిక్ ఈవెంట్, మూన్స్టర్ ట్రాక్, ఐడియా ప్రజెంటేషన్, ఆటో నోవా, పేపర్ ప్రజెంటేషన్, క్విజ్, లైవ్ ప్రాజెక్టులు తదితర విభాగాలలో పోటీలు నిర్వహిస్తారు. వర్సిటీ ల్యాబ్లో ఉన్న అధునాతన యంత్రాలను విద్యార్థులు చూసేందుకు వీలుగా ప్రదర్శన ఏర్పాటు చేస్తారు.